– నియోజకవర్గాల పునర్విభజనపై మంత్రి కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం వినాలనీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారంనాడాయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాలవాసులుగా గర్వపడుతున్నామన్నారు. పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అనీ, కేంద్రం అన్ని విషయాలు వింటుందనే ఆశిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయం గెలుస్తుందంటూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన నియోజకవర్గాల పునర్విభజనపై కథనాన్ని ట్యాగ్ చేశారు.