సీట్లు ఇవ్వకుంటే కేటీఆర్‌ను ఓడిస్తాం

– సిరిసిల్లలో ముదిరాజుల భారీ ధర్నా
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ముదిరాజులకు రానున్న ఎన్నికలోష్ట్రa సరైన స్థానం కల్పించాలని ముదిరాజ్‌లు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల శాసనసభ టికెట్లు కేటాయించాలని, లేకుంటే సిరిసిల్లలో కేటీఆర్‌ను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానంలో ఐదువేల మందితో ముదిరాజులు మహాధర్నా నిర్వహించారు. కళాశాల మైదానం నుంచి నేతన్న చౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌, గాంధీ చౌక్‌ మీదుగా ప్రదర్శన చేపట్టారు. భారీ వానలో తడుస్తూ ధర్నా, ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజుల సంఘం జిల్లా అధ్యక్షులు రానవేని లక్ష్మణ్‌, కోర్‌ కమిటీ సభ్యులు పిట్టల భూమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60లక్షల మంది జనాభా ఉన్న ముదిరాజులకు శాసనసభ సీట్లు కేటాయించాలని కోరారు. అత్యధిక ముదిరాజ్‌ కులుస్తుల జనాభా ఉన్న మునుగోడు, పఠాన్‌ చెరువు, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మహా ధర్నాలో వివిధ పార్టీలకు చెందిన ముదిరాజ్‌ నాయకులు రెడ్డవేని గోపి, రేగుల మల్లికార్జున్‌, చొక్కాల రాము, గొడుగు నరసయ్య, ఉత్తమ్‌ అంజయ్య, పిట్ల రాము, గోపాల్‌, కీసరి నాగరాజు, తుపాకుల రవి, బోయిని చంద్రయ్య న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.