దమ్ముంటే నీ కొడుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించు

If you dare, declare your son as CM candidate– కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ము కేసీఆర్‌కు ఉందా?అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ సవాల్‌ విసిరారు. అలా చేస్తే మరుక్షణమే బీఆర్‌ఎస్‌ పార్టీ నిలువునా చీలిపోతుందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యు లు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కొండేటి శ్రీధర్‌, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్‌, జె.సంగప్ప, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. పసుపుబోర్డు, సమ్మక్క, సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, క్రిష్ణా ట్రిబ్యునల్‌కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
క్రిష్టా ట్రిబ్యునల్‌ విషయంలో కేంద్రాన్ని కేసీఆర్‌ బదనాం చేస్తున్నారనీ, 2020 అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి కేసీఆర్‌కు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టరు ఒక్కరే కాబట్టే దాని హాజరు కాలేదని ఆరోపించారు. పూర్తికాని పాల మూరు ప్రాజెక్టు నుంచి ఒక్క మోటారు ఆన్‌చేసి పది లక్షల ఎకరాలకు సాగు నీరిందించే బడా ఇంజినీర్‌ కేసీఆర్‌ మాత్రమేనని దెప్పిపొడిచారు. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌లో నీటి కేటాయింపు అంశమే లేదనీ, అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఎలా సాధ్యమని నిలదీశారు. కేసీఆర్‌ కొడుకుకు కండ కావరం తలకెక్కిందనీ, ఆ పార్టీకి బుద్ధి ఉన్నవాళ్లు ఎవ్వరూ ఓటేయ్యరని అన్నారు. పొరపాటున కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిస్థితి శ్రీలంకగా మారుతుందని హెచ్చరించారు.