మాంసాహారం తింటే…

If you eat meat...–  ఉత్పాతాలు తప్పవు : ఐఐటీ మండీ డైరెక్టర్‌
సిమ్లా : ప్రజలు మాంసాహారం భుజించడం వలనే రాష్ట్రంలో కొండచరి యలు విరిగిపడటం, కుంభవృష్టి వంటి ఉత్పాతాలు జరుగుతున్నాయని హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐఐటీ సంస్థ పేర్కొంది. ఇకపై మాంసాహారం భుజించబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించింది. ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐఐటీ మండిలో జరిగింది. ఐఐటీ మండి డైరెక్టర్‌ లక్ష్మీంధర్‌ బెహ్రా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొన్ని రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న కుంభవృష్టికి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలు పలువురు మృత్యువాతపడ్డారు. దీనిపై బెహ్రా తనదైన రీతిలో స్పందించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌ గణనీయమైన పతనాన్ని చూస్తోంది. ఇది అంతా జంతువులను చంపడం వలనే జరుగుతున్నది. అమాయక ప్రాణులను క్రూరంగా చంపుతున్నారు. ఇది పర్యావరణ క్షీణతతో సంబంధాన్ని కలిగి వుంటుంది. అది మీరు చూడలేరు’ అని విద్యార్థులనుద్దేశించి బెహ్రా మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ‘కొండచరియలు విరిగిపడటం, కుంభవష్టి, ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా జంతువులను హింసించడం, ప్రజలు మాంసాహారం తినడం వలనే జరుగుతున్నాయి. మంచి మనుషుల్లాగా మారాలంటే… మాంసాహారం తినకూడదు’ అన్నారు. కాగా, ఐఐటీ పూర్వ విద్యార్థి, వ్యాపారవేత్త ఒకరు స్పందిస్తూ… ’70 ఏండ్లుగా విద్యార్థుల్లో నింపుతున్న విజ్ఞానం ఈ మూడనమ్మకాలతో తుడిచిపెట్టుకుపోతుంది. పతనం ప్రారంభమైంది’ అని తెలిపారు. ఐఐటీ మండిలో ఇటువంటి అంశాలను ప్రస్తావించడం విచారకరమని ప్రొఫెసర్‌ గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు.