అనుబంధ గ్రామాన్ని పట్టించుకోరా?

Don't mind the attached village?– సీసీ రోడ్డు, అండర్‌ డ్రయినేజీ నిర్మాణ పనులు నిల్‌
– సమస్యల వలయంలో నజిబ్‌నగర్‌ గ్రామం
– పిచ్చి మొక్కలతో విజృంభిస్తున్న దోములు, పామలుతో భయాందోళనకు గురువుతున్న స్థానికులు
– పట్టపగలు వెలిగే వీధిదీపాలు
– వృథాగా పారుతున్న ‘భగీరథ’ నీరు గ్రామకఠంలో కబ్జాలు
– పలు సమస్యలపై విన్నవించుకున్నా పట్టించుకోని సర్పంచ్‌
నవతెలంగాణ-మొయినాబాద్‌
గ్రామాన్ని అభివృద్ధి పరచి గ్రామస్తుల సౌకర్యార్థం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం గ్రామ సర్పంచ్‌ బాధ్యత. కానీ మొయినాబాద్‌ మండలంలోని కాశింబౌలీ సర్పంచ్‌ అనుబంధ గ్రామమైన నజిబ్‌నగర్‌ లో గ్రామస్తుల సమస్యలు అస్సలు పట్టించుకోవడం లేదు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సర్పంచ్‌ అన్న ఈ విషయాన్నే మరిచారని పలువురు విమర్శిస్తున్నారు. అనుబంధ గ్రామమైన నజిబ్‌నగర్‌ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదన్నారు. గ్రామంలో ఇండ్ల పక్కన పిచ్చి మొక్కలు, గడ్డి ఉండటంతో పురుగులు, పాములు వస్తున్నాయని స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. దోమలు విజృంభిస్తున్నాయని దీంతో పలువురు ఆనారోగ్య పాలవుతున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కాలనీల్లో రోడ్లపైన మురుగు నీరు ఏరులై పారుతున్నా, పట్టించుకోవడం లేదన్నారు. ఈ మురుగుతో కాలనీల్లో బురద మయంగా మారడంతో పాదాచారులు, వాహన దారులకు ఇబ్బంగా మారుతోంది. ఈ విషయంపై సీసీరోడ్లు, అండర్‌ డ్రయినేజీ నిర్మాణ పనులు చేపట్టాలని సర్పంచ్‌ను కోరగా, తమ గ్రామానికి నిధులు కేటాయించడం లేదని చెబుతున్నట్టు పలువులు వెల్లడించారు. భగీరథ వాటర్‌ పైప్‌ లీకేజీ కావడంతో నీరంతా వృథాగా పోతుంది. ఈ విషయంపై సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవడం లేదని గ్రామస్తులు దుయ్యబడుతున్నారు. అలాగే గ్రామంలో గ్రామకఠం భూమిని అక్ర మార్కులు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా అవేవి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ కబ్జాల్లో సర్పంచ్‌కు కూడా అక్రమదారుల నుంచి పెద్ద మొత్తంలో ముట్టజెబుతున్నారని గ్రామస్తుల గుస గుసలు వినిపిస్తున్నాయి. కబ్జాదారులతో చేతులు కలిపి గ్రామాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, కబ్జాదారులు అంతా మేం చూసుకుంటాం మీరు గ్రామానికి రానవసరం లేదనీ భరోసానివ్వడంతోనే సర్పంచ్‌ అటు వైపు కూడా కన్నెత్తి చూడరని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పాలన కాలం ముగిసే సమయంలోనైనా అనుబంధ గ్రామంపై కూసింత ప్రేమ చూపి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
సర్పంచ్‌ గ్రామస్తుల సమ స్యలు అస్సలు పట్టించు కోవడం లేదు. నాలుగేేండ్ల పాలన లో సీసీ రోడ్లు, అండర్‌ డ్రయినేజీ నిర్మాణ పనులు చేపట్టలేదు. కాలనీల్లో పించ్చిగడి, మొక్కలు ఏపుగా పెరగడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఆన్‌ఆఫ్‌ లేక పగటిపూట విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నాయి. గ్రామస్తులకు ఎదైన సమస్య వస్తే, మేమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. భగీరథ నీరంతా వృథాగా పోతుందని సర్పంచ్‌కు చెబుతున్నా పట్టించుకోరు. ఇప్పటికైనా సర్పంచ్‌ స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.
సోమా అవినాష్‌ ,గ్రామస్తులు