కమ్యూనిస్టులకు కేసులు, జైలు కొత్త కాదు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి డిమాండ్
నవతెలంగాణ-హయత్‌నగర్
పేదలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటంలో కమ్యూనిస్టులకు కేసులు, జైళ్లు కొత్త కాదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో పేదలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. సోమవారం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సీఐటీయూ హయత్‌నగర్ సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి అధ్యక్షతన ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. ఇల్లు లేని వారందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇవ్వకుండా కేసులు, అరెస్టులతో భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తోందన్నారు. పెద్దోళ్లకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గూడు అవసరమని, తలదాచుకోవడానికి ఇంటి వసతి ఇవ్వాలని అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం ప్రభుత్వానికి తగునా అని ప్రశ్నించారు. మహిళలని కూడా చూడకుండా సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలో సీఐ జలంధర్‌రెడ్డి విచక్షణారహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, స్థానిక నాయకులు గణేష్ గౌడ్‌తోపాటు 9 మంది మహిళలను అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి నిర్బంధించడం అన్యాయమైన చర్య అన్నారు. ఈ చర్యను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. సాహెబ్‌నగర్ కలాన్ 71 సర్వే నెంబర్‌లో హయత్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది, వారి బంధువులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిని ఆక్రమించుకున్నారని, స్థానిక ఆర్‌ఐ భార్య పేరు మీద తప్పుడు రికార్డు సృష్టించి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. 71 సర్వే నెంబర్‌లో 60 గజాల భూమిని పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద సంవత్సరానికి రెండు కోట్ల ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, కార్మిక సంఘం, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహ, సీపీఐ(ఎం) నాయకులు తుమ్మల సత్తిరెడ్డి, ఈ.నరసింహ, కిషన్, మహేష్, సీహెచ్.వెంకన్న, ఆలేటి ఎల్లయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.వీరయ్య, కిషన్, సీహెచ్.కృష్ణయ్య, కట్టా శ్రీనివాస్, కొత్త బిక్షపతి గౌడ్, భీమనపల్లి కనకయ్య, సీహెచ్.మల్లేశం, జంగయ్య, సుగుణ, పద్మ, ఉప్పలమ్మ యశోద పాల్గొన్నారు.