ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం

– తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లిన చర్యలు శూన్యం
– అదిగో ఇదిగో అంటూ కాలయాపనంతో కాలం వెళ్లదీస్తున్న రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్‌
వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూసున్న ఒకటే అన్న చందంగా అక్రమ నిర్మాణదారులు అధికారులకు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తారనేది స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వేనెం. 386లో ప్రభుత్వ అసైన్‌ మెంట్‌ భూమిలో అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణం చేపట్టిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. అక్రమ నిర్మాణంపై. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇట్టి విషయంపై నవతెలంగాణ అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ రవీందర్‌ దత్తు దష్టికి తీసుకెళ్లడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడి నిర్మాణాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు . కానీ హామినిచ్చి వారం రోజులు గడిచినా ఇప్పటికి అట్టి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే ఇలా కాలయాపనతో కాలం వెళ్లదీస్తున్న తీరుకు పలు అనుమానాలకు తావిస్తుందని పలువురు ఆరోపించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడం నిచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే గాని పట్టించుకోరు
మండలంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న పట్టించుకోవడం లేదని రెవెన్యూ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెం 444లో ఇటీవల అక్రమంగా చేపట్టిన నిర్మాణంపై స్థానికులు సోషల్‌ మీడియా ద్వారా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే గాని, కలెక్టర్‌ అదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు. మండలంలో ప్రభుత్వ భూములు కళ్ళ ముందే అక్రమాలకు గురైన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.