కథ విన్నప్పుడే ఈ విజయాన్ని ఊహించా..

మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఎస్‌కేఎన్‌ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ చిత్రానికి సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రం విశేష ప్రేక్షకాదరణతో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సినిమా సక్సెస్‌ సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజరు బుల్గానిన్‌ మీడియాతో ముచ్చటించారు.
‘కమెడియన్‌ సినిమాలకు మ్యూజిక్‌ చేశావంటూ నా మీద ముద్ర వేశారు. ఆఫర్లు సరిగ్గా రాలేదు. ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అలా ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ చేస్తూ కాకినాడలో ఉన్న నాకు దర్శకుడు సాయి రాజేష్‌ ఆన్‌లైన్‌లో కథ వినిపించారు. ఈ కథ విన్నప్పుడే ఇది కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనుకున్నా. ‘ప్రేమిస్తున్నా’ పాటను రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. మెలోడీ పాటను చేయగలిగితే.. ఏ పాటనైనా కంపోజ్‌ చేయగలమని నా నమ్మకం. మాస్‌ పాటలోనైనా మెలోడీ ఉంటేనే ఎక్కువ రోజులు గుర్తుంటుందని నా అభిప్రాయం. సాంగ్స్‌ కంపోజ్‌కు ఎక్కువ రోజులు పట్టలేదు. ‘ఓ రెండు మేఘాలిలా’ అనే పాటను కూడా చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్‌ చేశాం. ప్రతీ పాటలో మెలోడీ ఉంటుంది. అందుకే బ్యాక్‌ గ్రౌండ్‌లో కూడా ఆ పాటల ట్యూన్‌నే వాడాం. సాంగ్స్‌ రిలీజ్‌ అయినప్పుడే కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక చూద్దామని అన్నాను. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్‌ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. నా మ్యూజిక్‌కు అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విజరు దేవరకొండ చెప్పిన మాటలు, నాని మెసెజ్‌ నాకు స్పెషల్‌. నాకు నాని, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలని ఉంది’ అని తెలిపారు.