కుదరని ఏకాభిప్రాయం

Impossible consensus– వారం తర్వాతే కాంగ్రెస్‌ మొదటి జాబితా
– కమిటీలోని రాష్ట్ర నేతలతో చైర్మెన్‌ వన్‌ టూ వన్‌
– దాదాపు ఎనిమిదన్నర గంటల పాటు స్క్రీనింగ్‌ కమిటీ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక పంచాయితీ ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. నాలుగు సార్లు సుదీర్ఘ భేటీలు నిర్వహించినా… అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా పలు అసెంబ్లీ స్థానాల్లో క్యాండిడేట్ల ఎంపిక విషయంలో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో పార్టీ అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యం కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం జీఆర్జీ రోడ్‌ లోని కాంగ్రెస్‌ వార్‌ రూంలో నాలుగో సారి స్క్రీనింగ్‌ కమిటీ భేటి అయింది. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ మురళీధరన్‌ నేతత్వంలో జరిగిన ఈ భేటిలో కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగేష్‌ మేవాని, కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్‌ మధు యాస్కీ, ఏఐసీసీ సెక్రటరీలు పీసీ విష్ణునాధ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, రోహిత్‌ చౌదరి, కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు లు పాల్గొన్నారు. ఉదయం 12:00 గంటకు ప్రారంభమైన భేటి… రాత్రి 8 గంటల వరకు సాగింది. తొలుత ఎలాంటి వివాదాలు లేని, గత మూడు మీటింగ్‌ ల్లో స్పష్టత వచ్చిన దాదాపు 70 స్థానాలపై చర్చించారు. తొలి రెండు గంటల్లోనే ఈ సీట్లకు పోటీ చేసే క్యాండిడేట్ల పై స్పష్టతకు వచ్చారు. ఈ సందర్బంలో పలువురు లీడర్ల మధ్య పొరపచ్చ తప్ప… మీటింగ్‌ సజావుగానే సాగింది. అయితే… మిగిలిన సీట్లకు క్యాండిడేట్లను ఫైనల్‌ చేయడంలో… ఏకాభిప్రాయం కుదరకపోవడం సుదీర్గంగా మీటింగ్‌ కొనసాగింది. కానీ సుమారు ఎనిమిదన్నర గంటల పాటు సాగిన భేటి తర్వాత కూడా… ఏ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం చూపనట్లు తెలిసింది. అలాగే కమిటీలోని సభ్యులు ఎవరికి వారే తాము ప్రతిపాదించిన క్యాండిడేట్‌ కే విజయ అవకాశాలు ఉన్నాయంటూ వాదనలు వినిపించారు. దీంతో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ తీవ్ర అసంతృప్తి కనబరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్ల మిగిలిన సుమారు 32 స్థానాల్లో తుది నిర్ణయానికి రాలేకపోయినట్టు తెలిసింది. ఇక పలు జాయినింగ్‌ లు, ఇతర క్రిటికల్‌ పొజిషన్‌ లో ఉన్న దాదాపు 10 స్థానాలపై అసలు చర్చనే జరగనట్టు కమిటీ సభ్యుల ద్వారా తెలిసింది. దీంతో ఏకాభిప్రాయం కుదిర్చే దిశలో… స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ రాష్ట్ర నేతలతో వన్‌ టూ వన్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా వివాదస్పదంగా, భిన్న అభిప్రాయాలు ఉన్న స్థానాలపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ అభిప్రాయాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లి… త్వరలో మరోసారి మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు.