కరెంటు బిల్లుపై గొడవలో..

– తండ్రిని రాడ్డుతో కొట్టి చంపిన కొడుకు
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
ఇంటి కరెంట్‌ బిల్లు విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. వారి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ఆవేశానికి గురైన కొడుకు తండ్రిపై రాడ్డుతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ అమానవీయ ఘటన వికారాబాద్‌ జిల్లాలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని అత్తెల్లి గ్రామానికి చెందిన తండ్రి రాంచంద్రయ్య(58), కొడుకులు యాదయ్య ఒకే ఇంట్లో ఉంటున్నారు. కాగా, వారుంటున్న ఇంటి విద్యుత్‌ బిల్లు విషయంలో.. ‘బిల్లు నువ్వు కట్టు అంటే.. నువ్వు కట్టు..’ అంటూ ఇరువురూ గొడవకు దిగారు. ఈ గొడవ తారస్థాయికి చేరడంతో ఇరువురు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. మంగళవారం గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా ఆవేశానికి గురైన కొడుకు యాదయ్య రాడ్డుతో తండ్రిపై దాడి చేశాడు. ఈ ఘటనలో రామచంద్రయ్య తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే పంచాయతీ పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.