అవినీతిలో హోం శాఖ

– దానిపైనే ఎక్కువ ఫిర్యాదులు

– సీవీసీ 2022 వార్షిక నివేదిక

– తరువాత స్థానాల్లో రైల్వే, బ్యాంక్‌ అధికారులు

న్యూఢిల్లీ : అవినీతి విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందుంది. గత ఏడాదిలో ఈ శాఖకు చెందిన అధికారులపై అధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) 2022 వార్షిక నివేదిక వెల్లడించింది. తరువాత స్థానాల్లో రైల్వే, బ్యాంక్‌లకు చెందిన అధికారులు ఉన్నారు. 2022లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన అధికారులు, ఉద్యోగులపై మొత్తంగా 1,15,203 అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 85,437 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 29,766 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో 22,034 ఫిర్యాదులు మూడు నెలలుకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాదిలో హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులపై మొత్తంగా 46,643 ఫిర్యాదులు వచ్చాయి. రైల్వే శాఖకు చెందిన ఉద్యోగులపై 10,580, బ్యాంకులు చెందిన ఉద్యోగులపై 8,129 ఫిర్యాదులు వచ్చాయి. హోం మంత్రిత్వ శాఖపై వచ్చిన ఫిర్యాదుల్లో 23,919 ఫిర్యాదులను పరిష్కరించగా, 22,724 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 19,198 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. రైల్వే అధికారులపై వచ్చిన ఫిర్యాదుల్లో 9,663ను పరిష్కరించారు. మరో 917 పెండిగ్‌లో ఉన్నాయి. ఇందులో 9 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుల్లో 7,762ను పరిష్కరించారు. 367 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 78 మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే దేశ రాజ ప్రాంతం ఢిల్లీకి చెందిన ఉద్యోగులపై 7,370 అవినీతి ఫిర్యాదులు వచ్చాయి.

    బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులపై 4,304 ఫిర్యాదులు వచ్చాయి. కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 4,236 ఫిర్యాదులు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 2,617 ఫిర్యాదులు వచ్చాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఉద్యోగులపై 2,150 ఫిర్యాదులు వచ్చాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 1,619 ఫిర్యాదులు, ఆర్థిక మంత్రిత్వ శాఖపై 1,202 ఫిర్యాదులు, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సిబిఐసి) ఉద్యోగులపై 1,101 ఫిర్యాదులు వచ్చాయి. బీమా కంపెనీల ఉద్యోగులపై 987 ఫిర్యాదులు, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ ఉద్యోగులపై 970 ఫిర్యాదులు, ఉక్కు మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 923 ఫిర్యాదులు వచ్చాయి.