నామినేటెడ్‌ పదవుల్లో

In nominated posts– వికలాంగులకు రిజర్వేషన్‌ ఇవ్వాలి
– పెన్షన్‌ రూ.10,000కు పెంచాలి
– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
నామినేటెడ్‌ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్‌ అమలు చేయాలని, పెన్షన్‌ రూ.10,000కు పెంచాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. వికలాంగుల కమిషన్‌ ఏర్పాటు చేసి చైర్మెన్‌ను వెంటనే నియమించాలన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. పెరుగుదలకు అనుగుణంగా ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ రూ.4016 నుంచి రూ.10,000కు పెంచా లని కోరారు. ఆసరా పెన్షన్‌లకు ఆదాయపరిమితి విధించే జీవో నెంబర్‌ 17 రద్దు చేసి 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్‌ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల మల్లేష్‌ మాట్లాడుతూ.. వికలాంగుల కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నారు. వైకల్య ధ్రువీకరణ పత్రం కలిగిన వికలాంగులకు ఆర్టీసీ, రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్‌ 10లోపు తగ్గించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. వికలాంగుల సంక్షేమం, సాధికారత కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలని కోరారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేయాలన్నారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.దయానంద్‌ రావు మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హోం ఏర్పాటు చేయాలని, 33 జిల్లాల్లో వికలాంగుల కోసం హాస్టల్స్‌ హోమ్స్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌పీడీ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు, హీమోఫిలియో హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షులు చంద్రశేఖర్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ వికలాంగుల విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ చారి, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్‌, రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.రాజు, కషప్ప, యశోద, బస్వరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి దశరథ్‌, బి.గణేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.గోపాల్‌, రంగారెడ్డి, భుజంగ రెడ్డి పాల్గొన్నారు.