పదోన్నతుల్లో

– డ్రైవర్‌, మెకానిక్‌లకు అవకాశమివ్వండి
– టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సర్వీసులో ఉన్న కార్మికులకు పదోన్నతుల్లో భాగంగా నిర్వహించే జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షల్లో డ్రైవర్‌, మెకానిక్‌లకు కూడా అవకాశం కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌కు వినతిపత్రం సమర్పించారు. టీఎస్‌ఆర్టీసీ ఆఫీసు సిబ్బందిలో ఫీడర్‌ క్యాడర్‌గా ఉన్న జూనియర్‌ అసిస్టెంటు (పర్సనల్‌), జూనియర్‌ అసిస్టెంటు (అకౌంట్స్‌) విభాగాల్లోని ఖాళీలను, ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఆర్‌.సీ, కండక్టర్స్‌, టెలిఫోన్‌ ఆపరేటర్స్‌ నుంచి అర్హత కలిగిన వారికి టెస్టు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారితో ఆ ఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్య తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు తెలిపారు. దాదాపు 16 ఏండ్ల తర్వాత ఇలాంటి టెస్టును సెప్టెంబర్‌ 26న నిర్వహిస్తున్నారనీ, ఈ మధ్యకాలంలో అనేకమంది చదువుకున్న వారు డ్రైవర్లు, మెకానిక్‌లుగా సంస్థలోకి వచ్చారనీ, వారికి కూడా జూనియర్‌ అసిస్టెంటుగా క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ రాసేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు రిక్రూట్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌లో అవసరమైన సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.