ఆరావళి పర్వత ప్రాంతంలో

– నుహ్ మత ఘర్షణల నిందితుడి అరెస్టు
– కాల్పులకు తెగింపు
గురుగ్రామ్‌ : నుహ్ లో మతపరమైన హింసాకాండకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడ్ని ఆరావళి పర్వతాల్లోని టౌరు ప్రాంతంలో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే సయయంలో నిందితుడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిందితుడి కాలికి గాయమయింది. చికిత్స కోసం నల్హార్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని దిధర గ్రామానికి చెందిన ఆమీర్‌గా గుర్తించారు. నిందితుడు, అతని సహాయకులు టౌరు ప్రాంతంలో ఉన్నారనే ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతంలో గాలింపుచర్యలు ప్రారంభించారు. ఈ సమయంలోనే నిందితుడు పోలీసులపై కాల్పులకు దిగాడు. కాగా, మిగిలిన నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఆమీర్‌ వద్ద నుంచి స్వదేశీ తయారీ తుపాకీ, ఐదు క్యాట్రేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.