రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లో

–  కేసీఆర్‌ బందీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం బందీ అయ్యిందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ)రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసి బినామీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల మెప్పు కోసమే 111 జీవోను ఎత్తేశారని విమర్శించారు. దీంతో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జంట జలాశయాలు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. ప్రభుత్వ జోక్యంతోనే కాకతీయ వర్సిటీ భూముల ఆక్రమణ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన పోలీసులే రాజకీయనేతల అండతో దర్జాగా కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వర్సిటీ భూముల ఆక్రమణపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపాలని డిమాండ్‌ చేశారు. భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోని పక్షంలో కాకతీయ వర్సిటీ భూముల పరిరక్షణ కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొమ్మిదేండ్లుగా బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించి, బీసీ కమిషన్‌ కోరలు తీసేశారని తెలిపారు. కేసీఆర్‌కు బీసీల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు.