– బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కృష్ణాజలాల నీటివాటా సమస్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వరుసబెట్టి తాయిలాలను ప్రకటిస్త్నున్నది. ఇందుకు కేంద్ర క్యాబినెట్‌లో పలు నిర్ణయాలు చేసి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నది. దాదాపు తొమ్మిదేండ్లుగా పెండింగ్‌లో పెట్టిన అనేక అంశాలను ఎన్నికల తరుణంలో ముందుకుతెచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నది. కృష్ణా జలాలపై తెలంగాణ ఏర్పాటైన నెల రోజులకే సీఎం కేసీఆర్ లేఖ రాసినా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం, నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఫైలును కదిలించింది. ఇటీవల మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన ప్రధాని మోడీ పలు హామీలను గుప్పించారు. పుసుపు బోర్డును మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే బుధవారం ఢిల్లీల్లో కేంద్ర మంత్రివర్గం కృష్ణా జలాల నీటివాటా సమస్యను తేల్చడానికి ప్రస్తుతం అమల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించింది. త్వరలోనే టర్మ్ ఆఫ్ రెపరెన్స్(మార్గదర్శకాలు) వెలువరిస్తామని ప్రకటించింది.
తెలుగు రాష్ల్రాల మధ్య జలవివాదాల పరిష్కారంలో పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిన మోడీ సర్కారు, ఇప్పుడు యుద్ధప్రాతిపదికనే పలు ప్రయోజనాలను ప్రకటిస్తుండటంలో పరమార్థం ఎన్నికలే అన్న సంగతి అందరికి తెలిసిందే. పాతపద్దతిలో కాకుండా 50:50నిష్పత్తిలో కృష్ణా జలాలను వాడుకునే హక్కును కట్టబెట్టాలని తెలంగాణ తొలినాళ్ల నుంచి పోరాడుతున్నది. కాగా అంటు ఏపీ, ఇటే కేంద్రం రకరకాల వాదనలు చేస్తూ పొద్దుపుచ్చుతూ వచ్చాయి. 2018లో ఒకలా, 2020లో మరోలా నిర్ణయాలు చేసి గందరగోళ పరించింది. పునర్వీభజన చట్టాన్ని పట్టించుకోలేదు. సుప్రీంకోర్టులో కేసీఆర్ సర్కారు వేసిన కేసును ఉపసంహరించుకున్న మూడు సంవత్సరాలకు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లోని సమస్యలను మాత్రమే కేంద్రం దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నది. తెలంగాణకు సంబంధించి అనేక సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.