బీజేపీ ఎంపీ అనుచిత తీరు

Inappropriate behavior of BJP MP– మహిళా ఎమ్మెల్యేపై చేతులు వేసి అసభ్య ప్రవర్తన
– సమావేశంలో అసౌకర్యానికి గురైన ఎమ్మెల్యే
– ఎంపీకి దూరంగా వెళ్లి కూర్చున్న వైనం
– యూపీలోని అలీఘఢ్‌లో ఘటన.. వీడియో వైరల్‌
– ఎంపీ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
లక్నో : ఇటీవల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళల రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించబడింది. మరోపక్క, బేటీ బచావో, బేటీ పడావో అంటూ మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటున్నది. మహిళల భద్రత పట్ల తమకు చిత్తశుద్ధి ఉన్నదని పలు సార్లు బీజేపీ నాయకులు అనేక సమావేశాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. అయితే, ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ.. మహిళా ఎమ్మెల్యే పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మహిళా ఎమ్మెల్యే సమ్మతి లేకుండానే సదరు ఎంపీ ఆమె భుజాల మీద చేతులు వేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బీజేపీ ఎంపీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై అందరి ముందు ఒక ఎంపీ ఇలా చేతులు వేయటం ఏమిటనీ ప్రతిపక్షాలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటన యూపీలోని అలీఘఢ్‌లో చోటు చేసుకున్నది. అలీగఢ్‌ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌, స్థానిక ఎమ్మెల్యే ముక్తా రాజాలు కోల్‌ ప్రాంతంలో సెప్టెంబర్‌ 25న దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో సతీశ్‌ గౌతమ్‌.. ముక్తా రాజా చేతిలో చేయి వేసి నవ్వాడు. అనంతరం ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఎంపీ తీరుతో మహిళా ఎమ్మెల్యే ఇబ్బందికరంగా భావించింది. అతనిని వెంటనే ఆ చర్య నుంచి నిరోధించింది. ఈ సమయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎంపీ తనపై చేతులు వేయటంతో అసౌకర్యానికి గురైన మహిళా ఎమ్మెల్యే వెంటనే తన సీటును మార్చుకున్నది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్యలో మరో బీజేపీ నాయకుడు కూర్చున్నాడు.
సోషల్‌ మీడియాలో ఆగ్రహం
వీడియో వైరల్‌ అయిన వెంటనే ప్రజలు బీజేపీ నాయకుడి అసభ్యకరమైన చర్యపై విస్తృతంగా విమర్శించారు. మహిళల భద్రతపై కాంగ్రెస్‌ ప్రశ్నలు లేవనెత్తింది. ఇది సంస్కారవంతమైన బీజేపీ వాస్తవికత అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మీడియా ప్యానలిస్ట్‌ సురేంద్ర రాజ్‌పుత్‌ అన్నారు. సతీష్‌ గౌతమ్‌ చర్యను బాధిత మహిళా ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్టు చూపుతున్న ఘటనను కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ కూడా ఖండించింది.