నేడు కేరళలో తొలి 3డి భవనం ప్రారంభోత్సవం

తిరువనంతపురం : కేరళలో తొలి 3డి భవనాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. తిరువనంతపురంలోని పిటిపి నగర్‌లో కేరళ రాష్ట్ర నిర్మితి కేంద్ర (కెస్నిక్‌) ప్రాంగణంలో 380 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 3డి భవానాన్ని నిర్మించారు. ఒక గదితో అమాజ్‌-28 సమ్మర్‌హౌస్‌ పేరుతో ఈ భవన నిర్మాణాన్ని కేవలం 28 రోజుల్లో పూర్తి చేశారు. కెస్నిక్‌తో కలిసి ఐఐటి మద్రాస్‌ పూర్వ విద్యార్థులకు చెందిన త్వస్తా అనే స్టార్టప్‌ ఈ భవనాన్ని నిర్మించింది. ఈ మేరకు కెస్నిక్‌-త్వస్తా మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నిర్మాణ కోసం పేటెంట్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని ఉపయోగించారు. ఈ మిశ్రమాన్ని పొరలు పొరలుగా వేయడానికి ఒక రోబోటిక్‌ చేతిని ఉపయోగించారు. డెమో ప్రాజెక్ట్‌గా నిర్మించిన భవనానికి రూ. 11 లక్షలు ఖర్చయింది. ఇలాంటి 3డి భవనాలు కేరళ నిర్మాణ రంగంలో గొప్ప మార్పులు తీసుకునివస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే కెస్నిక్‌-త్వస్త చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.