ఉమ్మడి పౌరస్మృతిపై పొంతన లేని వాదనలు

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలంటున్న కేంద్రం వాదన.. చెప్పే సమాధానాలకు పొంతన లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. ‘ఉమ్మడి పౌరస్మృతి-వివాదాలు’ అంశంపై హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ కమలానగర్‌లోని సీపీఐ(ఎం) ఆఫీసులో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి అధ్యక్షతన సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రధానమంత్రి అయ్యాక 21వ లా కమిషన్‌ ఏర్పాటు చేసిన సమయంలో ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని, అది కావాలని కూడా కోరుకోనవసరం లేదని నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. కానీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ఎజెండా అమలు కోసం వారికి అనుకూలంగా 22వ లా కమిషన్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశంలో అన్ని మతాల వారికి వ్యక్తిగత అంశాల చట్టం ఉందని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం, ఆచారాన్ని బట్టి వ్యక్తిగత అంశాల చట్టాలు రూపొందించుకున్నట్టు తెలిపారు. ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలని రాజ్యాంగంలో ఉందని, స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లయినా ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడవన్నారు. బహు భార్యత్వం అవుతుందనేది బీజేపీ నాయకుల మరో వాదన అన్నారు. ముస్లింలు, ఆదివాసీల్లోనే కాదు బహుభార్యత్వం అనేది అన్ని మతాల్లోనూ ఉందన్నారు. పేదరికంలో ఉన్న చిన్న కుటుంబాల్లోనే అవగాహనాలోపంతో ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని తెలిపారు. ఎక్కువగా గిరిజనులు, ఆదివాసీలే కడుపేద తరగతులుగా ఉన్నారని, వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ఎక్కువ మంది పిల్లలను కనే పరిస్థితి ఉండదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నాయని కేంద్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని, కానీ ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రజల్లో అసమానతలు, భావోద్వేగాలు పెరుగుతాయని అన్నారు. ఇప్పటికే స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌, వరకట్న నిషేధిత యాక్ట్‌, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, గృహహింస వేధింపు చట్టాలు పర్సనల్‌ లా నుంచి వచ్చినవే అన్నారు. అన్ని మతాలు, చట్టాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. సీపీఐ(ఎం)గా హిందూ పర్సనల్‌ లాలో పురుషులను, మహిళలను సమానంగా చూసేలా చట్టం తీసుకురావాలని కోరుతున్నామన్నారు. అన్ని మతాల పర్సనల్‌ లాలో కూడా ఇలాగే చేస్తే ఎలాంటి చట్టాలు తేవాల్సిన అవసరం లేదన్నారు.
కేరళ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చట్టాలను తీసుకొచ్చి ఎలాంటి గొడవలు లేకుండా చేసినట్టు తెలిపారు. కేంద్రం కూడా కేరళ ప్రభుత్వం లాగా చేస్తే చట్టాల్లో ఎలాంటి మార్పులూ అవసరం లేదన్నారు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసమే అని, అప్పటి వరకు దీన్ని సాగదీసి మళ్లీ అధికారంలోకి రావాలనేది బీజేపీ ఎత్తుగడలో భాగమని విమర్శించారు. బీజేపీ కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే మనకు కూడా శ్రీలంక, పాకిస్థాన్‌ లాంటి పరిస్థితులు వస్తాయని వివరించారు. దీన్ని ప్రజలు గమనించి బీజేపీ, దాని మిత్రపక్షాన్ని రాబోయే ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు కె.చంద్రశేఖర్‌, ఎం.వినోద, జిల్లా కమిటీ సభ్యులు జి.శ్రీనివాసులు, ఎన్‌.శ్రీనివాస్‌, జేవీ వరప్రసాద్‌, ఎం.శంకర్‌, వివిధ కంపెనీల కార్మికులు పాల్గొన్నారు.