– ఏడాదిలోనే అత్యధిక స్థాయికి
– బ్లూమ్‌బెర్గ్ వెల్లడి
మాస్కో : గత వారం అమెరికా.. రష్యా ఇంధన రంగంపై కొత్త ఆంక్షలు విధించినప్పటికీ శుద్ధి చేసిన రష్యా ఇంధన ఎగుమతులు దాదాపు ఒక సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయని బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ వివరించింది. జనవరి మొదటి పది రోజుల్లో రష్యా పెట్రోలియం ఉత్పత్తుల సముద్ర రవాణా 11 నెలల గరిష్ట స్థాయికి చేరుకుందనీ, అది సగటున రోజుకు 2.5 మిలియన్ బ్యారెళ్లు (బీపీడీ) అని విశ్లేషణ సంస్థ వోర్టెక్సా డేటాను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ పేర్కొన్నది. డిసెంబర్ రోజువారీ సగటుతో పోలిస్తే ఈ పెరుగుదల 12 శాతంగా ఉందనీ, గతేడాది ఫిబ్రవరి తర్వాత ఇది అత్యధిక స్థాయిని సూచిస్తుందని సదరు వార్తా సంస్థ వివరించింది.బ్రిటన్‌తో సమన్వయం చేసుకుని అమెరికా గత వారం రష్యాపై సరికొత్త ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు రష్యాలోని ప్రధాన చమురు కంపెనీలైన గాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్‌లను, అలాగే పాశ్చాత్య ఆంక్షలను ధిక్కరించి రష్యన్ చమురును రవాణా చేయడానికి ఉపయోగించిన డజన్ల కొద్దీ నౌకలను (వీటిని అమెరికా ‘షాడో ఫ్లీట్’గా అభివర్ణించింది) లక్ష్యంగా చేసుకున్నాయి.
ఈ ఆంక్షలను రష్యా ఖండించింది. వాటిని ‘చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇవి ప్రపంచ ఇంధన మార్కెట్లను అస్థిరపరచవచ్చని హెచ్చరించారు. తాజా రౌండ్ ఆంక్షలు రష్యన్ వాణిజ్యంలో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 180 కంటే ఎక్కువ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రధానంగా ముడి చమురు రవాణాపై దృష్టి సారించాయి. అయితే, జనవరి 1 నుంచి 10 మధ్య ఎగుమతి చేయబడిన పెట్రోలియం ఉత్పత్తులలో కేవలం నాలుగు శాతం మాత్రమే ఆంక్షలు విధించబడిన ట్యాంకర్ల ద్వారా రవాణా చేయబడ్డాయని వోర్టెక్సా డేటాలో రికార్డ్ అయింది. ఇంతకు మించి ఈ నౌకల ప్రయాణాలలో ఎటువంటి విచలనం జరగలేదని బ్లూమ్‌బెర్గ్ వివరించింది.
రష్యా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇటీవలి పెరుగుదల ప్రధానంగా డీజిల్, ఇంధన చమురు ఎగుమతుల పెరుగుదల కారణంగా ఏర్పడిందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొన్నది. డిసెంబర్‌లో ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయాలు ముడి చమురు ఆదాయాల క్షీణతను మించిపోయాయనీ, దీనికి పెరుగుతున్న గ్యాసోలిన్ ప్రవాహాలు, మార్కెట్‌లో వాటి ధరల పెరుగుదల కారణమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఏ)ను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ చెప్పింది. రష్యా శుద్ధి చేసిన ఇంధన ఎగుమతుల్లో దాదాపు 40 శాతం ఉన్న డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులు డిసెంబర్ స్థాయిల నుంచి 17 శాతం పెరిగి 1.08 మిలియన్ బీపీడీలకు చేరుకున్నాయి. ఇది గత ఫిబ్రవరి తర్వాత అత్యధికం. బాల్టిక్ ఓడరేవుల నుంచి వచ్చే ఎగుమతులు 50 శాతానికి పైగా పెరిగాయి. ఇది వృద్ధికి దోహదపడిందని డేటా చూపించింది. ఇంధన చమురు ప్రవాహాలు కూడా పెరిగాయి. అవి 792,000 బీపీడీలకు చేరుకున్నాయి. ఇది 19 శాతం పెరిగి, జులై, 2023 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నది. ఆఫ్రికాకు ఎగుమతి అయిన రష్యా చమురు ఉత్పత్తులు అత్యంత గణనీయమైన పెరుగుదలను చూశాయి.