– బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికం
– రాజ్యాంగ రక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం : దళిత్ సమ్మిట్ రౌండ్ టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, దౌర్జన్యాలు రెట్టింపయ్యాయని దళిత్ సమ్మిట్ రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. దళితులకు రక్షణ కవచంలా ఉన్న రాజ్యాంగాన్ని కేంద్రం ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ కోసం దేశవ్యాప్త విశాల ఐక్య ఉద్యమం నిర్మించాలని చెప్పారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాలులో భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల మల్లేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అక్టోబర్ రెండోవారంలో రాష్ట్ర సదస్సు నిర్వహించి, డిసెంబర్ నాల్గవ తేదీ చలో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానంలో ప్రతిపాదించారు బీకేఎంయు రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందలాది సంఘాలను ఐక్యం చేసే విధంగా దళిత సమ్మిట్ కృషిచేస్తుందన్నారు ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ దళితుల భూమి సమస్యను ఎజెండాగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై రాజకీయాలకతీతంగా ఐక్యం కావాలన్నారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధు అమలులో అనేక అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయనీ, ఒకే యూనిట్ కింద ఐదు నుంచి పది పంచుతున్నారని చెప్పారు. సమావేశంలో పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పీ శివలింగం, మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భక్తుల రాంప్రసాద్ బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కడమంచి రాంబాబు, పంచాయతీ రాజ్ విశ్రాంత అధికారి ఇరిగి నరసింగరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్ దశరథ్, ఎమ్ బాలపీరు, డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు పులి కల్పన, చుంచు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.