– మోడీ పాలనలో అధికం
– స్త్రీలపై జరిగే నేరాలలో మూడోవంతు భర్త, అతని బంధువుల ద్వారానే
– వెల్లడిస్తున్న ఎన్సీఆర్బీ గణాంకాలు
న్యూఢిల్లీ : భారత్‌లో మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మోడీ పాలనలో వారిపై దాడులు తీవ్రమయ్యాయి. రక్షణ కరువవటంతో వారిపై జరుగుతున్న నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై ఇలాంటి నేరాలు భర్త, అతని బంధువుల ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. దేశంలోని మహిళకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించటంలో విఫలమవుతున్న కారణంగానే ఇలాంటి దాడుల సంఖ్య పెరిగిపోతున్నాయని మహిళ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు వెల్లడించారు. ఇందుకు మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మహిళలపై చోటు చేసుకున్న అమానుష ఘటనలే నిదర్శనమన్నారు.
ఐదేండ్లలో పెరిగిన దాడులు
ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం.. 2021లో భారత్‌లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో ”మహిళల నిరాడంబరతను కించపరిచే ఉద్దేశ్యంతో” 89,200 దాడి ఘటనలు జరిగాయి. గత ఐదేండ్లలో మహిళలపై నేరాలు 13 శాతం పెరిగాయి. 2017లో 3.15 లక్షల నుంచి 2021లో 3.57 లక్షలకు ఎగబాకాయి. 2021లో మహిళలపై జరిగిన మొత్తం 3,57,671 నేరాలలో అధిక భాగం లైంగికదాడి, గృహహింస, కిడ్నాప్ మరియు అపహరణ, ‘దౌర్జన్యం కలిగించే ఉద్దేశ్యంతో దాడి’ వంటి నిర్దిష్ట నేరాలకు ఆపాదించబడింది. ‘దౌర్జన్యం కలిగించే ఉద్దేశ్యంతో దాడి’ కి సంబంధించిన నేరం గత ఐదేండ్లలో 4 శాతం పెరగటం గమనార్హం.
దేశవ్యాప్తంగా 2017లో 86,001 హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇది 2021లో 89,200కి పెరిగింది. అయినప్పటికీ, మహిళలపై జరిగే నేరాలలో, మొత్తం నేరాలలో ‘దౌర్జన్యం కలిగించే ఉద్దేశ్యంతో దాడి’ గణనీయమైన వాటాను కలిగి ఉన్నది. 2021లో దీని వాటా 25 శాతంగా ఉన్నది.
భర్త, అతని బంధువుల ద్వారా నేరాలు
దేశంలోని మహిళలపై జరిగే నేరాలలో అధిక భాగం భర్తలు, వారి బంధువులే ద్వారానే జరుగుతున్నట్టు తెలిసింది. 2021లో మహిళలపై 1,36,234 క్రూరత్వ ఘటనలు భర్త లేదా అతని బంధువుల ద్వారా జరిగినట్టు రికార్డుల్లో నమోదైంది. ఇది 2017లో 1,04,551 నుంచి పెరగటం గమనార్హం. ఇది 2021లో మహిళలపై జరిగిన మొత్తం నేరాలలో దాదాపు మూడింట ఒక వంతు.
పశ్చిమబెంగాల్ ఫస్ట్.. యూపీ, రాజస్థాన్ నెక్స్ట్
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 19,952 నేరాలు నమోదయ్యాయి. భర్త లేదా అతని బంధువుల ద్వారా మహిళలపై జరిగిన నేరాల మొత్తం కేసుల పరంగా యూపీ, రాజస్థాన్ వరుస గా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ‘భర్త లేదా అతని బంధువు ద్వారా స్త్రీపై క్రూరత్వం’ అనే నిర్దిష్ట నేర వర్గం 30 శాతం పెరిగింది. దీని ప్రకారం, మొత్తం నేరాలలో దాని వాటా కూడా 5 శాతం పెరిగింది. 2017లో ఇది 33 శాతం నమోదు కాగా..2021లో 38 శాతానికి పెరిగింది. అలాగే, 14,000 కంటే ఎక్కువ సంఘటనలతో నిరాడంబ రతతో మహిళలపై జరుగుతున్న దాడుల జాబితాలో ఒడిశా అగ్రస్థానంలో ఉన్నది. మహా రాష్ట్ర, యూపీ, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దాదాపు సగం జనాభా భార్యను కొట్టడాన్ని సమర్థిస్తున్నారు
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 సమాచారం ప్రకారం.. భారత్‌లోని ప్రజల్లో సగం మంది కొన్ని అంశాల ఆధారంగా భార్యను కొట్టటాన్ని సమర్థించటం గమనార్హం. సమాచారం లేకుండా బయటకు వెళ్లడం, అత్తమామలను అగౌరవపరచడం, భర్తను అనుమానించడం వంటి కారణాలతో భర్త తన భార్యను కొట్టడాన్ని తప్పుబట్టలేదు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వేలో జాబితా చేయబడిన ఏడు కారణాల ఆధారంగా భర్త తన భార్యను కొట్టడం సరైందేనని 45 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు ( వీరంతా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నవారు) విశ్వసించారు.