జీ 20 దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్‌ సిద్ధం

– వ్యవసాయ మంత్రుల సమావేశంలో తోమర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయంలోని వివిధ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు జీ 20 దేశాలతో కలిసి పని చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీనోవాటెల్‌లో నిర్వహించిన జీ20-వ్యవసాయ మంత్రుల సమావేశానంతరం తోమర్‌ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు, నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కూడా రైతులు ఈ మార్పులను స్వీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామనీ, వీటి అమలు కోసం ఇప్పటివరకు రూ.1500 కోట్లు ఖర్చు చేశామన్నారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే పంట నష్టాలను తగ్గించేందుకు భారతదేశం వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ఇలాంటి వాతావరణ మార్పు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. శుక్రవారం ఆహార భద్రత, పోషకాహారం, డిజిటల్‌ టెక్నాలజీలు, వ్యవసాయ వ్యాపారం, వాతావరణ మార్పులు, సుస్థిర వ్యవసాయం మొదలైన అంశాలకు సంబంధించిన ఎజెండాపై చర్చ జరగనుందని చెప్పారు. జూన్‌17న జీ 20 వ్యవసాయ మంత్రులు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతోపాటు రోడ్‌ మ్యాప్‌ను విడుదల చేస్తారని తెలిపారు.