భారత్‌ వెలిగిపోతుందట!

– 2047 నాటికి ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాల్లో ప్రపంచంలోనే మిన్నగా.. : పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ గొప్పలు
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ వక్కాణించారు. కులం పేరుతో, మతం పేరుతో మారణహోమం సృష్టించే సంఘ్ పరివార్‌ మూకలను వెనకేసుకొచ్చే మోడీ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కులం, మతం, అవినీతి రహిత భారత్‌ గురించి లెక్చరిచ్చారు. 2047 నాటికి ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాల ఫలితాలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటాయని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. భారత దేశంలో అభివృద్ధికి మార్గం చూపిన ‘సబ్‌కా సాత్‌ – సబ్‌కా వికాస్‌’ నినాదం ప్రపంచ సంక్షేమానికి మార్గదర్శక సూత్రం లాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఒక వారంలో భారత్‌ జి20 సమ్మిట్‌కు ఆతిధ్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ప్రధాన సంపాదకులు సహా ముగ్గురు సీనియర్‌ సిబ్బందికి సుమారు 80 నిమిషాలు పాటు మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఏడాది నవంబర్‌లో ఇండోనేషియా నుంచి భారత్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. ఈ డిసెంబర్‌లో బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే ముందస్తు వార్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌, ఇతర ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సరికొత్త ప్రపంచ క్రమం ఏర్పడినట్లే, కోవిడ్‌ మహమ్మారి తరువాత మరొక నూతన ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. జీడీపీ కేంద్రీకృత దృక్పథం నుంచి ప్రస్తుత ప్రపంచం మానవ – కేంద్రీకృత దృక్పథానికి మారుతుందని మోడీ అన్నారు. ఇందులో భారత్‌ ఉత్ప్రేరకం పాత్రను పోషిస్తుందని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో భారతదేశ ఆర్థిక పురోగతి, ప్రపంచ వేదికలపై భారత్‌ ఎదుగుదల, సైబర్‌ భద్రత, రుణాల ఉచ్చు, బయో-ఇంధన విధానం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, వాతావరణ మార్పులు, 2047లో భారత్‌ ఎలా ఉండబోతుంది.. వంటి అంశాలపై మోడీ మాట్లాడారు. ప్రపంచ రుణ సంక్షోభం గురించి మోడీ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పృహతో ఉండాలని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలకు మోడీ పిలుపునిచ్చారు. 20వ శతాబ్దాపు విధానంతో 21వ శతాబ్ధాంలో ప్రపంచానికి సేవలు అందించలేమని అన్నారు. వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతూ వాతావరణ లక్ష్యాలను అందుకోవడంలో భారత్‌ ఎప్పుడూ అలక్ష్యం వహించలేదని అన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న చర్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిందని మోడీ చెప్పారు. కొన్నేళ్లలోనే సౌరశక్తి సామర్థ్యాన్ని 20 రెట్లు పెంచుకున్నామని తెలిపారు.