– అమెరికా అంబాసిడర్ ఎరిక్ గ్రాసెటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇండియా, అమెరికా మధ్య వ్యాపారం విపరీతంగా పెరుగుతోందని ఇండియాలో అమెరికా అంబాసిడర్ ఎరిక్ గ్రాసెటీ అన్నారు. ఇందుకు రెండు దేశాలు తీసుకున్న చొరవ కారణమని అన్నారు. టీ-హబ్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..’ఇండియా ఎకానమీ అద్భుతంగా ఎదుగుతోంది. హైదరాబాద్ సాధించిన ప్రగతి ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు మన దేశాల మధ్య వ్యాపారం దాదాపు సున్నాగా ఉండేది. అమెరికా గతేడాది భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల బిజినెస్ విలువ 191 బిలియన్ డాలర్లు దాటింది. మా దేశంలో రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. త్వరలో జరగబోయే మోడీ-బైడెన్ భేటీలో వాణిజ్యంపై ప్రధానంగా చర్చ జరగనుంది. టీ-హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్. ఐడియాలను ఇది బిజినెస్‌లుగా మార్చుతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తోంది’ అని ఆయన వివరించారు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడే భారతదేశానికి వచ్చానని, ఈ దేశం గురించి ఎంతో తెలుసుకున్నానని చెప్పారు. గతంలో భారత్ ప్రపంచానికి ఎన్నో ఇచ్చిందని, ఇప్పుడూ ఇస్తోందని అన్నారు. అమెరికా వీసాలకు భారీగా డిమాండ్ ఉందని, వీటిని త్వరగా జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే మూడు నెలల్లో అపాయింట్‌మెంట్ల సంఖ్యను భారీగా పెంచుతున్నామని, హైదరాబాద్‌లో వీసా ఆఫీసర్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ఎరిక్ వెల్లడించారు.