మరిన్ని టెస్టులు అవసరం భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

ముంబయి : భారత మహిళల జట్టు మరిన్ని టెస్టులు ఆడాల్సిన అవసరం ఉందని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడ్డారు. 2022-25 ఎఫ్‌టీపీలో భారత్‌ రెండు టెస్టులే ఆడనుండగా.. ఇంగ్లాండ్‌ (5), ఆస్ట్రేలియా (4), దక్షిణాఫ్రికా (3) ఎక్కువ మ్యాచులు ఆడుతున్నాయి. ‘ ఓ క్రీడాకారిణీగా ఎక్కువ టెస్టులు ఆడాలని అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీ20, వన్డేల కంటే టెస్టు క్రికెటే ఎక్కువగా చూశాం. వైట్‌బాల్‌ క్రికెట్‌ వినోదభరితమే కానీ టెస్టు క్రికెట్‌ ప్రతి క్రికెటర్‌ కోరుకునేది. భారత్‌ రెండు టెస్టులే ఆడనుంది. స్వదేశంలో ఆసీస్‌, ఇంగ్లాండ్‌లపై రెడ్‌ బాల్‌ క్రికెట్‌ ఆడనున్నాం. మహిళల క్రికెట్‌లో టెస్టు మ్యాచులను మరిన్ని పెంచాలి. దేశవాళీ క్రికెట్‌లోనూ పరిస్థితులు గుణాత్మకంగా మారాయి. ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులను మహిళలకు సైతం షెడ్యూల్‌ చేయాలి’ అని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు. భారత్‌కు 127 వన్డేలు, 154 టీ20ల్లో ఆడిన హర్మన్‌.. కేవలం మూడు టెస్టుల్లోనే కనిపించింది.