భారత కోరల్‌ ఉమెన్‌

Indian Coral Womanఉమా మణి… క్లైమేట్‌ ఛాంపియన్‌. తన 49 ఏండ్ల వయసులో మొదటి సారి నీటి అడుగున డైవ్‌ చేసింది. అప్పటి నుండి సముద్ర పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది. ఇప్పుడు అతి పెద్ద సముద్రం ఆమె కాన్వాస్‌గా మారింది. నీటి అడుగున తన అనుభవాలను అందంగా చిత్రించింది. ఇటీవల అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ ‘కోరల్‌ ఉమెన్‌’కి ఆమే ఓ ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు ఆమె ఓ పగడపు స్త్రీ. అంతరించిపోతున్న పగడపు దిబ్బలు, సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఈ డాక్యుమెంటరీని పొందుపరిచారు. కళాకారురాలు, సర్టిఫైడ్‌ స్కూబా డైవర్‌ అయిన ఆమె ఇటీవల సోనీ బిబిసి ఎర్త్‌ ద్వారా ఎర్త్‌ ఛాంపియన్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైన సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
ఉమా చిన్నతనంలో బొమ్మలు గీస్తుంటే ‘వీటి వల్ల రంగులు, పేపర్లు వేస్ట్‌, బాగా చదువుకుని మంచి వ్యక్తిని పెండ్లి చేసుకుంటే చాలు’ అని అమ్మమ్మ అనడంతో కళపై తనకున్న ఆసక్తిని పక్కనపెట్టేసింది. డాక్టర్‌ను పెండ్లి చేసుకొని భర్తతో కలిసి చెన్నై నుండి మాల్దీవులకు వెళ్లింది. అప్పటి నుండి కుటుంబానికే పరిమితమై రంగుల కాన్వాస్‌కు చాలా దూరమయ్యింది. తిరిగి 45 ఏండ్లు వచ్చిన తర్వాత తను కోల్పోయిన రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు సముద్రం, పగడపు దిబ్బల వైపుకు సైతం ఆమె మనసు మళ్లింది.
అతి తక్కువ మంది వెళ్లే ప్రదేశం
కోరల్‌ ఉమెన్‌గా గుర్తింపు పొందడానికి ఉమా ఎంతో శ్రమించాల్సి వచ్చింది. 40 ఏండ్లు దాటిన తర్వాత స్విమ్మింగ్‌, స్కూబా-డైవింగ్‌ చేయడానికి సిద్ధమయ్యింది. నీటి అడుగున పగడపు దిబ్బల గుండా ఈదడం మొదలు పెట్టింది. అప్పటి వరకు అతి తక్కువ మంది మహిళలు వెళ్ళిన ప్రదేశానికి వెళ్లేందుకు ధైర్యం చేసింది. ‘నా కొడుకు కాలేజీలో చేరిన తర్వాత నేను పెయింటింగ్‌ ప్రారంభించాను. వాటిలో కొన్నింటిని మాల్దీవులకు ఫ్రెంచ్‌ నేర్చుకునేందుకు వచ్చిన అలయన్స్‌ ఫ్రాన్‌కైస్‌ డైరెక్టర్‌కి (మ్యూరియల్‌ ష్మిత్‌) చూపించాను. ష్మిత్‌ ఒక థీమ్‌పై 30 చిత్రాలు గీయాల్సిందిగా నన్ను అడిగారు. వాటితో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తానని నాకు వాగ్దానం చేశారు. అందుకే రోజూ గులాబీలకు పెయింటింగ్‌ వేయడం మొదలుపెట్టాను. తులిప్స్‌కి వెళ్లి నా స్నేహితురాలి 50వ పుట్టినరోజున వాటిని బహుమతిగా ఇచ్చాను’ అని ఉమ పంచుకున్నారు.
జనం పెద్దగా రాలేదు
అప్పటి వరకు తన చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఆ నీటికి మాత్రం దూరంగా ఉంది. ఏప్రిల్‌ 2010లో ఆమె ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకుడైన డాక్టర్‌ పాస్కేల్‌ చబోనెట్‌ ద్వారా పగడపు దిబ్బలపై తీసిన ఒక డాక్యుమెంటరీని చూసింది. దాని తర్వాత ఉమా పగడాల ఉపయోగం, మహాసముద్రాల ప్రాముఖ్యత పై కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంది. త్వరలో ఆమె పగడపు దిబ్బలను చిత్రించాలని నిర్ణయించు కుంది. ఉమా తన మొదటి చిత్రాలను మాల్దీవుల్లోని మెరైన్‌ సెంటర్‌లో ప్రదర్శించింది. అయితే దాన్ని చూసేందుకు జనం పెద్దగా రాలేదు. కళలో ప్రాథమిక శిక్షణ లేని ఆమె ఏ మాత్రం నిరుత్సాహపడలేదు. పెయింటింగ్‌ను కొనసాగించారు. అధైర్యపడకుండా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సెలవులకు చెన్నై వెళ్ళి అక్కడే ఆర్ట్‌ కోర్సులో చేరింది.
కొత్తగా కావాలి
వివాంటా మాల్దీవుల్లో ఆమె ఎగ్జిబిషన్‌లో ఒక సందర్శకురాలి నుండి వచ్చిన కామెంట్‌ ఉమా దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేసింది. ‘నేను ఎన్నడూ చూడని చిత్రాన్ని చూడాలనుకుంటున్నాను అని ఒక మహిళ నన్ను అడిగారు. అయితే ఆమె చెప్పిన తీరు మొదట నాకు కోపం తెప్పించింది. కానీ అందులో చాలా నిజం ఉందని గ్రహించాను. అప్పటి వరకు నేను ఎప్పుడూ స్విమ్మింగ్‌ చేయలేదు, నీటి అడుగున వెళ్ళలేదు. పగడపు దిబ్బల గురించి నేను చిత్రించిన చిత్రాల నుండే ఆ అనుభవం వచ్చింది’ అని ఉమ గుర్తుచేసుకుంది. సలహా కోసం తన స్నేహితుడు డాక్టర్‌ అమల్‌ అలీని ఆశ్రయించింది. అలీ ఆమెను మాల్దీవుల మొదటి మహిళా డైవర్‌ షహీనా అలీకి పరిచయం చేసాడు. డైవింగ్‌ చేయాలనుకునే ఉమకు ఇప్పుడు మొదటి సవాలు ఈత నేర్చుకోవడం.
కోరల్‌ వుమన్‌ మేకింగ్‌
అధైర్యపడకుండా ఉమ అనేక డాక్యుమెంటరీ చిత్రనిర్మాతలను కలిసింది. కానీ వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఆమె ఎన్‌డిటివి ఆఫీస్‌కి కాల్‌ చేసింది. అక్కడే ఆమెకు ఫిల్మ్‌ మేకర్‌ ప్రియా తువస్సేరి నంబర్‌ ఇచ్చారు. ఆమెను సంప్రదించి ‘కోరల్‌ రీఫ్‌ గార్డెన్‌ల పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లపై డాక్యుమెంటరీకి సహకరించగలరా’ అని అడిగింది. కొంత కాలం వారి సంభాషణలు ఫోన్‌లో, స్కైప్‌లో కొనసాగాయి. 2017లో ఇద్దరూ కలుసుకున్నారు. ‘కానీ ప్రియకు వేరే ఆలోచనలు ఉన్నాయి. నాపై ఓ డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. ఎందుకంటే నా వయసులో చాలా మంది మహిళలు ఇలాంటి పనులు పెద్దగా చేయరు. నాకు అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించు కున్నాను’ అని ఉమా పంచుకుంది. ఉమా అంగీకరించడానికి కొంత సమయం పట్టింది. కోరల్‌ రీఫ్‌ గార్డెన్స్‌, కోరల్‌ వుమన్‌కి సంబంధించిన డాక్యుమెంటరీకి మధ్య గొడవ జరిగింది. కానీ చివరికి తువస్సేరి గెలిచింది. 2018లో తూర్పు తీరంలో రామేశ్వరం, రామనాథపురం, టుటికోరిన్‌లలో చిత్రీకరణ ప్రారంభించారు.
ఆమెను కదిలించింది
సముద్రంలోకి చాలా మురుగునీరు పంప్‌ చేయబడటం వల్ల ఆమె ఒక్క రోజుకే అనారోగ్యానికి గురయ్యింది. అయినా తన ప్రయాణం ఆపలేదు. ప్రతిరోజూ జరిగే ప్రతి డైవ్‌ తర్వాత ఉమ నోట్స్‌ తయారు చేసుకునేది. రంగులతో పాటు ఒక చిత్రాన్ని మనసులో ఉంచుకునేది. అయితే నీటి అడుగున జరుగుతున్న విధ్వంసం ఆమెను కదిలించింది. ‘రసాయనాలు, పురుగుమందులు, ఎరువులు, ప్లాస్టిక్‌, మురుగుతో సముద్రం నిండి ఉంది. దీని ఫలితంగా పగడపు దిబ్బలు నశించిపోతున్నాయని ఆమె గుర్తించింది.

ప్రత్యక్షంగా అర్థం చేసుకుంది
2016లో జరిగిన మాల్దీవుల మెరైన్‌ సింపోజియంలో ఉమా తన పెయింటింగ్స్‌ను ప్రదర్శించింది. దాంతో ఆమె కెరీర్‌ ఓ మలుపు తిరిగింది. పగడపు దిబ్బల ప్రాముఖ్యత, సముద్ర  పరిశోధనలోని వివిధ అంశాలు, కనుమరుగౌతున్న పగడపు దిబ్బల స్థితిని ప్రత్యక్షంగా అర్థం చేసుకుంది. తన కొడుకు బహుమతిగా ఇచ్చిన కెమెరాతో నీటి అడుగున షూట్‌  చేయాలని నిర్ణయించుకుంది. తన అనుభవాలతో డాక్యుమెంటరీ తీయాలని ఓ ప్రయత్నం చేసింది. ‘సినిమా నిర్మాణం గురించి నాకు ఏమీ తెలియదు. ఇది ఒక మూకీ సినిమా. పాత  చార్లీ చాప్లిన్‌ సినిమాలా ఉంది’ అని ఆమె నవ్వుతూ చెప్పింది.
అవగాహన కీలకం
పగడపు దిబ్బలు నీటి అడుగున పర్యావరణ వ్యవస్థను అందిస్తాయి. శక్తివంతమైన  అలల నుండి తీరాన్ని రక్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, సాహస పరిశ్రమలకు ఇవి  ఆదాయ వనరులు. పగడపు దిబ్బలు బఫర్‌గా పనిచేసి నీటి పీడనాన్ని తగ్గించినందునే 2004 సునామీ భారతదేశాన్ని ప్రభావితం చేసినంతగా మాల్దీవులను ప్రభావితం చేయలేదని  ఆమె గుర్తుచేసింది. అంతరించి పోతున్న పగడాలను కాన్వాస్‌పై చిత్రించడం కూడా ఆమెకు ఇదే తొలిసారి. 2019లో సినిమా విడుదలైన తర్వాత తన అనుభవాల గురించి మాట్లాడటానికి ఆమె బృందంతో కలిసి అనేక ప్రాంతాలకు వెళుతుంది. ఇప్పుడు తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఉమ, సముద్ర సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాల  గురించి పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులతో పాటు కార్పొరేట్‌ సంస్థలతో కూడా మాట్లాడుతూ అవగాహన కల్పిస్తుంది.
రెండవ రోజు  మానేసింది
2014లో ఉమా చెన్నైకి వచ్చి 15 రోజుల స్విమ్మింగ్‌ కోర్సులో చేరింది. మాల్దీవులకు తిరిగి వచ్చిన తర్వాత కొడుకు తన తల్లికి 25వ వివాహ వార్షికోత్సవ బహుమతిగా స్కూబా-డైవింగ్‌ కోర్సు కోసం సైన్‌ అప్‌ చేశాడు. ‘డైవ్‌ మొదటి రోజు సరిగా చేయలేదు. రెండవ రోజు అసలు వెళ్ళలేదు. నా డైవ్‌ మాస్టర్‌ యామిన్‌ ఇలా మానుకోవడం సరైనది కాదని, ప్రయత్నించినా అప్పటికీ రాకపోతే మానుకోని చెప్పారు. మానసికంగా సిద్దమై నెల రోజుల సమయం తీసుకున్నాను’ ఆమె చెప్పింది. తన మొదటి డైవ్‌లో ఉమా నీటి అడుగున చూసిన దృశ్యాలను చూసి మురిసిపోయింది. పగడాలు, రంగు రంగుల చేపలు, సముద్రపు పాము, ఒక చిన్న సొరచేపను చూసింది. ఇక తన తదుపరి డైవ్‌ల నుండి సముద్రపు మాయా ప్రపంచాన్ని కాన్వాస్‌లోకి దింపింది. ఆమె కళ ఇప్పుడు విభిన్న వీక్షణలు, అంతర్దృష్టులతో సజీవంగా మారింది.