భారత జీడీపీ6.8 శాతమే

India's GDP is 6.8 percent– అంచనాలకు ఎస్‌అండ్‌పీ కోత
ముంబయి : భారత వృద్థి రేటు ముందుగా అనుకున్న స్థాయిలో పెరగడం లేదని అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీలు విశ్లేషణలు చేస్తున్నాయి. జీడీపీ అంచనాలకు ఇటీవల ఇక్రా రేటింగ్స్‌, మోర్గాన్‌ స్టాన్లే కోత పెట్టగా.. అదే బాటలో తాజాగా గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం ఎస్‌అండ్‌పీ ప్రకటన చేసింది. పట్టణ డిమాండ్‌ పడిపోవడం, హెచ్చు వడ్డీ రేట్లు, విత్త వ్యయాలు పెరగడంతో రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత జీడీపీ తగ్గనుందని ఎస్‌అండ్‌పీ సోమవారం ఓ రిపోర్ట్‌లో తెలిపింది. వచ్చే 2025-26లో భారత జీడీపీ 6.7 శాతానికి, తర్వాత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇతక్రితం ఈ అంచనా వరుసగా 6.9శాతం, 7 శాతంగా ఉంది. ప్రస్తుత 2024-25లో 6.8 శాతంగా ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ”అధిక వడ్డీ రేట్లు, పట్టణ డిమాండ్‌ తగ్గడం, విత్త వ్యయాల్లోనూ క్షీణత, కొనుగోలు శక్తి పడిపోవడం తదితర కొన్ని ముఖ్యమైన సూచీలు ప్రతికూలతలో ఉన్నాయని.. సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిర్మాణం రంగం వృద్థి కూడా స్తబ్దుగా ఉంది. ఈ పరిణామాలు జీడీపీ పెరుగుదల తొలుత అంచనాలకు ప్రధాన ప్రతిబంధకంగా ఉన్నాయి.” అని ఎస్‌అండ్‌పీ విశ్లేషించింది.
ప్రస్తుత ఏడాదిలో చైనా జీడీపీ 4.8 శాతంగా, వచ్చే ఏడాది 4.1 శాతంగా, 2026లో 3.8 శాతం చొప్పున ఉండొచ్చని తెలిపింది. అమెరికా టారీఫ్‌ల పెంపు ప్రతిపాదనలు చైనాకు ప్రధాన సవాల్‌గా నిలువొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5 శాతానికి పరిమితం కావొచ్చని రేటింగ్‌ ఎజెన్సీ ఇక్రా బుధవారం ఓ రిపోర్ట్‌లో విశ్లేషించింది. ఇంతకు రెండు రోజుల క్రితం మోర్గాన్‌ స్టాన్లే కూడా జీడీపీ అంచనాలకు ఏడు శాతం నుంచి ఏకంగా 6.3 శాతానికి కోత పెట్టింది. ఏడాది భారీ వర్షాలు, బలహీనమైన కార్పొరేట్‌ కంపెనీల పనితీరు, సరుకుల ఎగుమతుల్లో పతనం. పడిపోతున్న వ్యక్తిగత రుణాల వల్ల డిమాండ్‌ పడిపోవచ్చని ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో దేశ వృద్థి 6.3 శాతానికే పరిమితం కావొచ్చని మోర్గాన్‌ స్టాన్లే పేర్కొంది. 2024-25లో భారత జీడీపీ 6.7 శాతానికి పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం 7 శాతంగా అంచనా వేసింది. ద్వితీయార్థంలో 6.7-6.8 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని పేర్కొంది. వచ్చే 2026-27లోనూ భారత జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చని మోర్గాన్‌ స్టాన్లే గ్రూప్‌ రీసెర్చ్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ ఉపాసన చచ్రా పేర్కొన్నారు.