నవతెలంగాణ-పిట్లం
ద్యం వికటించి రెండు నెలల పసికందు మృతిచెందగా.. స్థానిక నాయకులు ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రాణానికి రూ.లక్ష 20వేలు ఖరీదు కట్టారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామానికి చెందిన కొక్కొండ అనితకు సంగారెడ్డి జిల్లా మానూర్ మండలంలోని ఏలుగోయా గ్రామానికి చెందిన జైపాల్‌తో వివాహమైంది. కాగా ఆమెకు మొదటి కాన్పులో ఒక బాబు ఉండగా, రెండో కాన్పు నిమిత్తం రెండు నెలల కిందట అమ్మగారి ఇంటికి వచ్చింది. సుఖ ప్రసవం అయి పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో మండల కేంద్రంలోని శ్రీభవాని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆర్‌ఎంపీ డాక్టర్ రాజు వైద్యం చేశారు. అది వికటించి బాలుడు మృతిచెందాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రి ముందు బైటాయించి నిరసన తెలిపారు. వారికి స్థానిక యువకులు మద్దతుగా నిలిచారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ విజరు కొండ తన సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇంతలోనే గ్రామ, మండల నాయకులు ఆస్పత్రి సిబ్బందితో చర్చలు జరిపి చివరకు ఓ ఒప్పందం చేశారు. బాధిత కుటుంబానికి ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్ష 20 వేలు ఇచ్చేలా నిర్ణయించారు.