ద్రవ్యోల్బణం పెరగొచ్చు

ద్రవ్యోల్బణం పెరగొచ్చు– ఆర్‌బీఐ ఆందోళన
ముంబయి : దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో 5.5 శాతంగాయ నమోదు కాగా.. అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ హెచ్చరించారు. బుధవారం శక్తికాంత మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొందన్నారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బీఐ సమర్థంగా పని చేస్తోందన్నారు. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఒకటి అమెరికా ఎన్నికల ఫలితాలు కాగా.. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడటమన్నారు. ఆర్థిక వృద్థికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భారత వృద్థి రేటును పెంచడానికి ఆర్‌బిఐ 70కి పైగా అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్నారు.