లోతట్టు…

ఏం చేసిందో పాపం
పట్టణాల, మహానగరాల లోతట్టు ప్రాతం
జడివానలు పడి మునిగిపోతుంది
సైక్లోన్‌ సైతాన్‌కు గజగజ వణికిపోతుంది
లోగుట్టు పెరుమాళ్లకెరుక
తుఫాను వస్తే ఆ నేలంతా ప్రళయమే ఇక
కుండపోతల్లో నిండాతడిసి
కట్టుబట్టలతో కట్టుకన్న ఇండ్లను విడిచి
ఆకలిదప్పుల్తో అల్లాడుతుంది ఆ పల్లం
తడిసిన దేహాలతో
మనసులో ఎన్నో సందేహాలతో
కుటుంబాలు కుదేలయి రోడ్డున పడ్డవి
రవిని కరిమబ్బు కమ్మింది
కవికి ముసురు ముసుగేసింది
పాలకులకు, దళార్లకు కదల అవిటితనం అయింది
ఆ వైపు చూచేనాధుడెవరు? అవసరం ఎవరికి?
ఆ వరదబురదలో తిరుగాడే అపరిచితుడెవరు?
పత్రికలు కొన్ని పతాకశీర్షికలుగా
రాసిమురిపిస్తారు చివరికి
కలుక్కుమంటుంది గుండెలో మనిషన్నవాడికి
రిక్తహస్తం దూరానవున్నవాడిది
ఏం లాభం ?
మదిలో కలతనెలవంక తదియపొడుపు వినా
కలెక్టర్‌ గారికి కన్నెత్తి చూచే వీలు ఉండదు
మంత్రివర్యులకు ఖాళీ దొరకదు
ఎగువకాలనీవాసులకు కరుణపుట్టదు
కడక్‌ ఇస్త్రీవాడికి ఆలోచనతట్టదు
ఎన్నికల ప్రచారసమయంలో
హామిల వర్షంలో
లోతట్టు గల్లంతవుతుంది
వరద ముంపు మానవప్రాణుల ఇక్కట్లగురించి
చర్యలపై చిత్తశుద్ధి ఉండదు
తెల్లవారితే
దిగువ వాళ్ల దిగులసలు గుర్తుండదు
వారం దాక బురద ఎండదు
వాన నీటి క్రిమికీటకాలు
ఎంత రక్తం తాగినా వాటి కడుపు నిండదు
బాధితులకు ఓదార్పుగా
అలెగ్జాండర్‌ దండయాత్రలా అంటువ్యాధులు బయలుదేరుతాయి
ఈలోపు చిరు ఉపశమనం
పకతి దయతలుస్తుంది గాలిగా
భానుడు ఉష్ణాన్ని ఉరుముతాడు జాలిగా
పంకంబింకం మరచి బీళ్లుగా వొళ్లు విరుస్తుంది
పునరావసం అపుడు ముంపు శరణార్ధులను విడుస్తుంది
శరీరబలవంతులు తడిసిన కొంపల్లోకి
గంపెడు దుఃఖంతో చేరుతారు
బలహీనులు ధవఖానలో దీనంగా మూలుగుతారు
వర్షంవరదలో మునిగిన ఇండ్లు ఎటుచూసిన వరదనీటికవిత్వపు ఆనవాళ్లు
ప్రతీకంటి నుండి జాలువారు అశ్రుధారలే కనిపిస్తాయి
సర్దుబాటు తత్వానికి, తెలియక చేసిన తప్పులకు పశ్చాతాప పడడానికి జీవితంలో
గురువు అవసరమే ఉండదు కదా బహుశా
కుదటపడ్డ కొన్నిరోజులకే
పిడుగుపడ్డట్టు వాతావరణశాఖ హెచ్చరిక!
బంగాళాఖాతంలో అల్పపీడనం తీరందాటిందని
రాగల ఇరవైనాలుగు గంటల్లో
గంటకు నూటఇరవై మైళ్ళ వేగంతో వీచు తుఫాన్‌ గాలులతో కూడిన
భారీవర్షాలని.

– రమేశ్‌ నల్లగొండ
8309452179