నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌

ముంబయి: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. మంగళవారం ఈ నౌకను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌకతో దేశ నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింతగా పెరిగాయన్నారు. ఈ సందర్భంగా ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, భారత స్వావలంబనకు ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ నిదర్శనమని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ పొడవు 163 మీటర్లు, బరువు 7,400 టన్నులు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగమైన ‘ఇంఫాల్‌ యుద్ధం’లో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా నౌకకు పేరు ఈ పెట్టారు. అలాగే ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరును భారత యుద్ధనౌకకు పెట్టడం ఇదే తొలిసారి. ఈ యుద్ధనౌకను ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ నిర్మించింది.
2017 మేలో ఈ నౌక నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. 2019 ఏప్రిల్‌లో జలప్రవేశం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28 నుంచి పూర్తిస్థాయి ట్రయల్స్‌ జరిపారు. అక్టోబరులో నౌకాదళానికి అప్పగించారు. నిర్మాణం, ట్రయిల్‌ రన్స్‌ను అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకున్న స్వదేశీ నౌకగా ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ రికార్డులకెక్కింది. ఈ నౌకలో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి.