బదులుకు బదులు

Instead of instead ofప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది, ప్రేమ మొండిది. పగ కూడా గుడ్డిదే, పిచ్చిదే, మొండిదే. ప్రేమకు మమకారం అనే మరో పేరుంటే పగకు ప్రతీకారం అనే మాట వుండనే వుంది.
వాళ్ళిద్దరి ఇళ్లూ ఎదురెదురుగ్గానే. ఇంటి యజమానులిద్దరిలో ఒకడు రౌడీ అయితే మరొకడు రౌడీలకు రౌడీ. వాళ్లిద్దరి మధ్యా వైరం ఎప్పుడు ఎందుకు ఎలా పుట్టిందో మరి. ఒకళ్లకొకళ్లు ఎదురు పడితే ఒకరి చూపు మరొకర్ని కాల్చేస్తుంది. వారి మధ్య మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు. కానీ మధ్యవర్తుల్తో మాట్లాడేటప్పుడు మాత్రం నరికేస్తా, కాల్చేస్తా, బూడిద చేస్తా, సర్వనాశనం చేస్తామన్న మాటలు మాత్రం విరివిగా వాడేస్తారు.
ఓ నాడు ఓ కాకుల గుంపు ఈ ఇంటి మీదుగా ఎగురుతోంది. ఆ గుంపులో ఆ ఇంటి మీద వాలి వచ్చిన కాకిని మిగతా కాకులు ఈ ఇంటి మీద పొరపాటున కూడా వాలకు అని హెచ్చరించేయి. పోగాలము దాపురించిన కాకి ఆ మాట వినిపించుకోక ఏం జరుగుతుందిలే అని ఈ ఇంటి మీద వాలింది. అంతే ఢామ్మని తుపాకీ పేలి కాకి కైలాసం చేరుకుంది. ఓనాడు ఈ ఇంటాయన ఈ ఇంటి అరుగుమీద, ఆ ఇంటాయన ఆ ఇంటి అరుగుమీద నిలబడి వున్నప్పుడు కుర్ర సన్యాసి ఒకడు ఏం జరుగుతుందిలే అని ఇంత పచ్చిగడ్డి తెచ్చి ఇద్దరి మధ్య రోడ్డుమీద పోశాడు. వాడు తెచ్చిన గడ్డి పచ్చిదే కాదు, నీట్లో తడిపింది కూడా. అయితేనేం భగ్గుమని మండింది.
ఇలాగ ఆ రెండిళ్లమధ్య వైరం, పగ, ప్రతీకారం రోజురోజుకీ పెరిగిపోయేయి. ఈ సంగతి పసిగట్టిన కాకులు ప్రాణాలమీది తీపితో ఆ వాడ వైపే రావడం మానేశాయి.
ఈ ఇంటి పిల్లాడు, ఆ ఇంటి బాబూ ఒకే బళ్లో చదువుకునేవారు. ఉన్నది ఒకటే బడి మరి. మొదట్లో మాస్టర్‌ ఆ రెండిండ్ల మధ్య పగను చల్లారుద్దామని పిల్లలిద్దరినీ ఒకే బెంచీలో కూచోబెట్టాడు. అయితే పగ అనేది చేతులు ముడుచుకు కూచోదు కదా. సురేష్‌ కంపాక్సు బాక్సులోంచి రమేష్‌ బ్లేడు తీసుకుని తన పెన్సిల్‌ చెక్కుకున్నాడు. తన బ్లేడుతో పెన్సిల్‌ చెక్కుకున్న రమేష్‌ చేతిమీద బ్లేడుతో గాటు పెట్టాడు సురేష్‌! తన రక్తం కళ్ల చూసిన సురేష్‌ పుస్తకాల బ్యాగులో అగ్గిపుల్ల గీసి పడేశాడు రమేష్‌.
జన్మజ్మల అనుబంధంలాగే పగలూ, ప్రతీకారాలూ తరతరాలకు బదిలీ అవుతాయని అర్ధమైన టీచర్‌కు వేరువేరు దృవాల దగ్గర వాళ్లని కూర్చోబెట్టాల్సి వచ్చింది.
నిక్కర్లు వదిలేసి ప్యాంటుల్లోకి మారిన రమేషూ, సురేషూ బడి వదిలేశారు, కాలేజీలో చేరడం కోసం, అక్కడ రెండు గ్రూపులకు లీడర్లవడం కోసం, క్రికెట్టు మ్యాచ్‌లో బ్యాట్లతో కొట్టుకోవడం కోసం. ఈ ఇంటాయనా ఆ ఇంటాయనా పోతూ పోతూ తిరిగి వచ్చే ఛాన్స్‌ లేదు కనుక తమ పిల్లలకి ఆస్తితో పాటు పగనీ, ప్రతీకారాన్ని అప్పజెప్పి పోయారు.
బళ్లో రెండు దృవాల్లో కూచున్నట్టుగానే రమేషూ, సురేషూ కాలేజీ ఒదిలాక చట్టసభల్లో కూడా కూచున్నారు. ఎవరి పార్టీ వారిదే. ఎవరి జండా వారిదే. ఎవరి అజెండా వారిదే. అయితే ఇద్దరి లక్ష్యం ఒక్కటే. ఏం చేసైనా సరే, అధికారంలోకి రావడమే. అధికారం దక్కాక అవనీతిని అందలం ఎక్కించి అయిన కాడికి సొమ్ము దండుకోవడమే. ఆస్తులు సంపాదించుకోవడంలోనూ, అధికారం చలాయించడంతోనూ ఇద్దరికీ పూర్తి సంతృప్తి కలగదని తెల్సు వాళ్లకి. తమలో రగులుతున్న ప్రతీకారం తీర్చుకోవడం కోసం అవకాశం చిక్కించుకోవడం కోసం ఎదురుచూసేవారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు. ఒకరిని ఒకరు దొంగ దెబ్బ తీయడానికి సిద్ధంగా వుండేవారు. ఒకరి కోసం ఒకరు గోతులు తవ్వుతుండేవారు.
కాలం కలిసొచ్చి ఒకరు అధికారంలోకి వస్తే మరొకరు ప్రత్యర్దులయ్యారు. ఇంకేం వుంది. పగ ఒళ్లు విరుచుకుంది. ప్రతీకారం కారాలూ మిరియాలూ పేస్టులు చేసింది. అవతలి వార్ని జైలు ఊచలు లెక్కపెట్టించడం కోసం యుక్తులూ కుయుక్తులూ వాడింది. ఇద్దరిలో ఎవ్వరూ నీతిపరులు కారు. ఎవరికీ న్యాయం మీద నమ్మకం లేదు. ధర్మం అనే పదానికి అర్ధమే తెలీదు. ఇద్దరిలోనూ జఠరాగ్నితో పాటు రగిలేది ఒక్కటే. అదే పగ. దానిపేరే ప్రతీకారం. మీసం లేని అధికారం గడ్డం తడుముకుంది. రమేష్‌ పండగ చేసుకునే రోజు రానే వచ్చింది. సురేష్‌ ఊచలు లెక్కపెట్టడానికి శ్రీకృష్ణుడి బర్త్‌ప్లేస్‌కు వెళ్లాల్సి వచ్చింది.
కాలం కలిసిరాక ఒకరి అధికారం చేయి జారింది. ఊచలు లెక్కబెట్టిన చేయి అధికారదండం చేతబట్టింది. ఇంకేం వుంది. ఒళ్లు విరుచుకున్న పగకు ప్రతీకారం కారాలూ మిరియాలూ పేస్టు చేసి అందించింది. ఇద్దరూ నీతి తప్పిన వాళ్లే. ఇద్దరూ ఊచలు లెక్కపెట్టే అర్హత వున్నవాళ్లే. ఒకరి వంతయిపోయింది. మరొకర్ని ఊచలు లెక్కపెట్టడానికి శ్రీకృష్ణుడి బర్త్‌ ప్లేస్‌ ఆహ్వానం చెప్పింది. రమేష్‌ లాగే సురేష్‌ పండగ చేసుకునే రోజు రానే వచ్చింది.
ఇది రమేష్‌లూ, సురేష్‌లూ పండగలు చేసుకునే కాలం. రాజుల కాలంలోనే కాదు, ఈనాటికీ రాచరికం అనుభవిస్తున్న వారిలో పగలూ ప్రతీకారాలూ వర్థిల్లుతూనే వున్నాయి. ప్రేమలాగా పగ కూడా గుడ్డిదే, పిచ్చిదే, మొండిదే!
ప్రేమ, పగ వంటివి పట్టించుకోని చట్టం మాత్రం తన పని తాను చేసుకోవలసిందే!

 

– చింతపట్ల సుదర్శన్‌
9299809212