నేడు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. గతనెల 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది కలిపి మొత్తం 4,12,325 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.