ఇంటర్‌ ఉద్యోగులకు బదిలీలు జరపాలి

Inter employees should be transferred–  సీఎం కేసీఆర్‌కు టిప్స్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు జరిపించాలని ”తెలంగాణ ఇంటర్మీడియట్‌ గవర్నమెంట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టిగ్లా), తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్‌)” రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. కాలేజీల ప్రిన్సిపాళ్లకు టిగ్లా, టిప్స్‌ నాయకులు వినతిపత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టిప్స్‌ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్‌, కొప్పిశెట్టి సురేష్‌, గాదె వెంకన్న, కె నగేష్‌, ఎండీ రహీమ్‌ ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకులు, ఉద్యోగులకు టిగ్లా రాష్ట్ర అధ్యక్షులు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.