‘గురుకులం’లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Inter student commits suicide in 'Gurukulam'– తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
– బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు
– విద్యార్థినులను ఇండ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు
నవతెలంగాణ-మద్నూర్‌
గురుకుల పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
పెద్ద ఎక్లారా గేటు వద్ద గల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దాసరి వసుధ(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెది బిచ్కుంద మండలం మానేపూర్‌ గ్రామం. మంగళవారం ఉదయం గదిలో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు, ఇతర విద్యార్థినుల తల్లిదండ్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. దీంతో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌ రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. బాన్సువాడ ఆర్డీఓ భుజంగరావు, మద్నూర్‌ ఆర్‌ఐ శంకర్‌ విచారణ చేపట్టారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సాయంత్రం వరకు ఆందోళన సాగింది. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీనిచ్చారు. చివరకు విద్యార్థిని తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కళాశాలలో మిగతా విద్యార్థినులను తల్లిదండ్రులు ఇండ్లకు తీసుకెళ్లారు. తమ పిల్లలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో మొదటి సంవత్సరం విద్యార్థిని నీటి ట్యాంకులో పడి చనిపోయిన ఘటనపై ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయమూ జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం), బీఎస్పీ, బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర పార్టీల నాయకులు గురుకుల కళాశాలను సందర్శించి ఘటనపై సమగ్ర విచారణ విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఏమీ తెలియరాలేదు.