వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..!

Interest rates may not decrease..!– ద్రవ్యోల్బణంపైనే ఆర్‌బిఐ దృష్టి : ఎస్‌బిఐ ఛైర్మన్‌ శెట్టి అంచనా
ముంబయి : రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ప్రస్తుత ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని ఎస్‌బిఐ ఛైర్మన్‌ సిఎస్‌ శెట్టి పేర్కొన్నారు. ఇప్పటికీ నెలకొన్న హెచ్చు ఆహార ద్రవ్యోల్బణ అనిశ్చితి నేపథ్యంలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను సడలించే అవకాశం లేదన్నారు. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నాలుగు సంవత్సరాల్లో తొలిసారి రేట్ల కోతకు సంకేతాలు ఇచ్చిందన్నారు. ఇది ఇతర ఆర్థిక వ్యవస్థలలోని సెంట్రల్‌ బ్యాంకులను అనుసరించడానికి ప్రేరేపించవచ్చన్నారు. అయితే సెంట్రల్‌ బ్యాంక్‌లు దేశ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటాయన్నారు. ఫెడ్‌ రేట్ల తగ్గింపు ప్రభావం చూపినప్పటికీ.. ఆర్‌బిఐ మాత్రం దేశీయంగా అహార ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టనుందన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చన్నారు. 2025 జనవరి – మార్చి త్రైమాసికం వరకు వేచి చూడాల్సి రావొచ్చన్నారు. ఇంతలో అహార ద్రవ్యోల్బణం తగ్గుదల ఉంటే తప్పా రేట్లలో తగ్గింపును ఆశించలేమన్నారు. ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) అక్టోబర్‌ 7-9 తేదీల్లో భేటీ కానుంది.
జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.54 శాతం గా ఉండగా.. ఆగస్టులో 3.65 శాతానికి పెరిగింది. ఆర్‌బిఐ లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. అహార ద్రవ్యోల్బణం 5.66 శాతంగా చోటు చేసుకుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు తొందరపడబోమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల అన్నారు. దీంతో అక్టోబర్‌లో జరగనున్న ఆర్‌బిఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తారన్న నిపుణులు అంచనాలకు శక్తికాంత తాజాగా చెక్‌ పెట్టినట్లయ్యింది. తాజాగా ఎస్‌బిఐ చీఫ్‌ కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో రుణగ్రహీతల ఆశలపై మరింత నీళ్లు చల్లినట్లయ్యింది. వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం నాలుగు శాతం కంటే తక్కువగా చోటు చేసుకుందని దాస్‌ గుర్తు చేశారు. అయినప్పటికీ కీలక వడ్డీరేట్ల తగ్గింపు అంశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. పాలసీ విధానకర్తలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దేశంలో అధిక ధరలు నెలకొన్న నేపథ్యంలో హెచ్చు వడ్డీ రేట్లను కొనసాగించాలని ఆర్‌బిఐ ఇటీవల నిర్వహించిన ఎంపిసి భేటీలో నిర్ణయించింది. దీంతో వరుసగా తొమ్మిదో సారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించింది.