ఐదో సారీ తగ్గని వడ్డీ రేట్లు

ఐదో సారీ తగ్గని వడ్డీ రేట్లు– రుణ గ్రహీతలకు మళ్లీ నిరాశ
– రెపో రేటు 6.5శాతమేొ ఆర్‌బీఐ నిర్ణయం
–  వృద్ధి 7శాతంగా ఉండొచ్చు :గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడి
న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ మరోమారు రుణ గ్రహీతలను నిరాశపర్చింది. కీలక వడ్డీ రేట్లను వరుసగా ఐదోసారి యథాతథంగా నిర్ణయించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. రెపో రేటును ఇంతక్రితం స్థాయిలోనే 6.5శాతంగా నిర్ణయించామన్నారు. ఇందుకు ఎంపీసీ సభ్యుల ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్టు శక్తికాంత తెలిపారు. ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య వరుసగా వడ్డీ రేట్లను పెంచింది. ఆరు సార్లలో 2.50 బేసిస్‌ పాయింట్లు లేదా 2.50 శాతం పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీంతో వడ్డీ, వాయిదా చెల్లింపులు ఎక్కువై రుణాలు భారం అయ్యాయి. ఈ క్రమంలోనే అనేక మంది గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహీతలు ఇకనైనా వడ్డీ రేట్లలో తగ్గుదల ఉండొచ్చని ఈ దఫా ఆశించిన వారికి నిరాశనే మిగిలింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని శక్తికాంత పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి మరింత సమయం పట్టనుందన్నారు. ఓ వైపు అప్పులు పెరగడం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు శాతానికి ఇంకా చేరుకోవాల్సి ఉందని పేర్కొంది.
2023-24లో దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువలో ఒడుదొడుకులు చాలా తక్కువగా ఉన్నాయని శక్తికాంత పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌ 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 604 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని దాస్‌ తెలిపారు. డిజిటల్‌ రుణాల్లో మరింత పారదర్శకత తెచ్చేలా రుణ ఉత్పత్తులను అందించే వెబ్‌ అగ్రిగేటర్ల కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. భవిష్యత్తు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాల విషయంలో రిస్క్‌ వెయిట్‌ను పెంచామన్నారు.