ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా పడింది. బుధవారం సుప్రీం కోర్టులో విచారణ రాగా ధర్మాసనం కూర్చోవడం లేదని, విచారణకు మరో తేదీని వెల్లడిస్తామని కేసును విచారిస్తున్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ వెల్లడించారు. ఫైబర్‌ నెట్‌ కేసులో తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్‌ ఇచ్చారని, వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు పరిశీలించి ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలాఎం. త్రివేదీల ధర్మాసనం విచారణ జరపాల్సి ఉండగా విచారణ వాయిదా వేసింది.