– కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
– 75వ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న హోం మంత్రి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐపీఎస్ అధికారులు విరివిగా వినియోగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లాభారు పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ 75వ ఐపీఎస్ ట్రైనీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయనీ, వాటిని అరికట్టే విషయంలో ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక వ్యూహరచన చేసి అమలు పర్చాలని సూచించారు. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం, టెర్రరిజంను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన అన్నారు. వీటిని అరికట్టే విషయంలో నూతన ఎత్తుగడలను ఐపీఎస్ అధికారులు అనుసరించాలని ఆయన కోరారు. దేశంలో జమ్మూకశ్మీర్‌లో మొదలుకుని ఇతరత్రా అంశాలకు సంబంధించిన చట్టాల్లో తీసుకొచ్చిన మార్పులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. పేదలకు న్యాయం చేయడంలో ఐపీఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధను వహించాలనీ, ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటు తగదని హెచ్చరించారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సాధిస్తున్న ప్రగతిపై విదేశాల్లో కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయని ఆయన చెప్పారు. నార్కోటిక్ డ్రగ్, హవాలా, క్రిప్టో కరెన్సీ వంటి నేరాలు విస్తృతం కాకుండా దేశవ్యాప్తంగా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల్లో వస్తున్న మార్పులు, నేరస్తులు అనుసరిస్తున్న నూతన ఎత్తుగడలు, వారు పాటిస్తున్న నూతన టెక్నాలజీని నిర్వీర్యం చేసే దిశగా పోలీసుల వ్యూహాలు నిరంతరం సాగాలని సూచించారు. 75వ బ్యాచ్‌లో 34 మంది మహిళా ఐపీఎస్ అధికారులుండటం పోలీసు శాఖలో మహిళలకు ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ఇండోర్, అవుట్ డోర్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన యువ ఐపీఎస్ అధికారులకు అమిత్‌షా బహుమతులు, అవార్డులను ప్రదానం చేశారు. 75వ బ్యాచ్ శిక్షణా సమయంలో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన అనుస్త కాలియా ప్రతిభాపురస్కారాన్ని హోంమంత్రి అమిత్‌షా అందజేశారు. ఎన్‌పీఏ డైరెక్టర్ అమిత్ గర్గ్ మాట్లాడుతూ..75వ బ్యాచీలో 155 మంది దేశవాళీ ఐపీఎస్‌లుండగా…20 మంది రాయల్ భూటాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలకు చెందిన అధికారులున్నారని తెలిపారు. ఈ బ్యాచ్‌లో ఎనిమిది అధికారులు తెలంగాణకు, ఐదుగురు ఆంధ్రాకు కేటాయించబడ్డారని చెప్పారు. అంతకుముందు యువ ట్రైనీ ఐపీఎస్ అధికారులు శిక్షణాంతర ముగింపు కవాతు అత్యంత ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.