‘మా ఉద్యోగులు చాలా కష్టపడి చెమటోడ్చుతున్నరు. ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నరు. వారు తెచ్చే రెవెన్యూలో కొంత వాటా వారికే ఇస్తాం. దేశం ఆశ్చర్యపోయే విధంగా మా ఉద్యోగులకు పే స్కేలు ఇస్తాం. ఐఆర్ కూడా ప్రకటిస్తాం. పీఆర్సీని నియమిస్తాం. ధనిక రాష్ట్రంలో మా ఉద్యోగులు కూడా ధనవంతులు కావాలి’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అసెంబ్లీలో ప్రకటించారు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పటికీ పీఆర్సీ(పే రివిజన్ కమిషన్) ఏర్పాటు చేయలేదు, ఐఆర్ ప్రకటించనూ లేదు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు 25 నుంచి 35 వరకు ఐఆర్(మధ్యంతర భృతి) ప్రకటిస్తారని కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో 4,91,304 ఉద్యోగులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు 1,37,000మంది ఉన్నారు. ఐదేండ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జీతభత్యాల సవరణ కోసం పేరివిజన్ కమిషన్ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. పీఆర్సీ నివేదిక వచ్చేవరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి గతంలో ప్రకటించే వారు. 1998లో 11శాతం, 2005లో 8.5, 2010లో 22, 2013లో 27శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ను అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేశాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి పీఆర్సీ(30శాతం ఫిట్మెంట్) గడువు 30జూన్2023న ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి జూలై 2023 నుండి రెండో పీఆర్సీ అమల్లోకి రావాలి. మెరుగైన పీఆర్సీ ఫిట్‌మెంట్ పొందాలంటే మంచి ఐఆర్ సాధించుకోవాలి. ఐఆర్ లేకుండా ఫిట్‌మెంట్ అమలు చేయడం వల్ల తొలి పీఆర్సీలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థికంగా భారీగా నష్టపోయారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన మొదటి పీఆర్సీ సకాలంలో 2018 మే 18 న ఏర్పాటు చేసినప్పటికీ అమలులో చాలా ఆలస్యం జరిగింది. గత పీఆర్సీలకు భిన్నంగా ఐఅర్ లేకుండానే ప్రభుత్వం నేరుగా తొలి పీఆర్సీని అమలు చేసింది. జులై 2018 నుంచి వర్తింప చేయాల్సిన ఆర్థిక ప్రయోజనాలను 21 నెలలు ఆలస్యంగా ఏప్రిల్ 2020 నుంచి అమలు చేసింది. జూలై 2018 నుంచి పీఆర్సీ అమలు చేస్తూనే మార్చి 2020 వరకు పెరిగిన వేతనాలు చెల్లించలేదు. 21నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నోషనల్‌గా ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రంలో అమలైన తొలి పీఆర్సీ వల్ల ఒక్కో ఉద్యోగి సగటున రూ.2-3లక్షలు నష్టపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ గడువు జూన్ నెలతో ముగిసింది. అక్కడి ప్రభుత్వం నూతన పీఆర్సీ నియమిస్తూ జీఓ జారీ చేసి, ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేవారిలో ఉపాధ్యాయ సంఘాలు ముందుంటాయి. గతంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీలు ఏర్పాటు చేసుకొని మంచి ఐఆర్ కోసం పీఆర్సీ కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు కూడా ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి జేఏసీని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల కావడంతో ఉపాధ్యాయులు వాటిలో నిమగమయ్యారు. మరో మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచి ఐఅర్ సాధించుకునేందుకు, రాష్ట్రంలో రెండో పీఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు సంఘటితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
– పాకాల శంకర్ గౌడ్, 9848377734