– మోడీ అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు
– అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులట
– అమెరికా రైతులపై వరాల జల్లులు
– స్వదేశీ రైతులకేమో మొండిచేయి
న్యూఢిల్లీ : పప్పులకు, మోడీ ప్రభుత్వానికి మధ్య విచిత్రమైన బంధం ఏదో ఉన్నట్లు కన్పిస్తోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పప్పుల ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మళ్లీ ఇప్పుడు…తొమ్మిది సంవత్స రాలు దాటిన తర్వాత మన దేశం మరోసారి పప్పులు, ఆహార ధరల ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనివార్యంగా కన్పిస్తోంది. మార్కెట్లలో పప్పుల ధరలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. దీంతో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించేందుకు సిద్ధపడుతున్నారు. తమ వద్ద ఉన్న పప్పుల నిల్వలను గోదాములకు తరలించి నిల్వ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమేమో 2015 నాటి సంక్షోభం తిరిగి పునరావృతం కాకుండా నివారించడానికి ఎగుమతి-దిగుమతులపై ఆంక్షలు విధించడం, కస్టమ్స్ సుంకాలు వంటి చర్యలకు సిద్ధపడుతోంది. ఎర్ర కందిపప్పు, కందిపప్పు, శనగపప్పు ధరలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు సానుకూలతకు బదులుగా ప్రతికూల ఫలితాన్ని ఇవ్వడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గత వారం వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. స్టాకిస్టులు తమ వద్ద నిల్వ ఉన్న ఎర్ర కందిపప్పు, కందిపప్పు, శనగపప్పు వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో ప్రకటించేలా చూడాలని అందులో సూచించారు. ఇటీవలి కాలంలో కందిపప్పు ధరలు 25% పెరగడంతో ప్రభుత్వం దిగుమతులకు అనుమతి ఇచ్చింది. దిగుమతిదారులు సైతం తమ వద్ద ఉన్న పప్పుల నిల్వలను ప్రకటించాలంటూ ప్రభుత్వం మరో ఆదేశాన్ని జారీ చేసింది. దిగుమతులపై ఆంక్షలు సడలించడంతో అనేకమంది వ్యాపారులు విదేశాల నుండి పెద్ద ఎత్తున పప్పులు కొనుగోలు చేసి, నిల్వ చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం పప్పులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అయితే దీనివల్ల వినియోగ దారులు కానీ, రైతులు కానీ ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు. ఎందుకంటే దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు, బడా నిల్వదారులు అప్పటికే తమ గోదాముల్లో భారీగా నిల్వలు దింపేశారు. ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయంగానే ఉన్నప్పటికీ అవి పప్పుల ధరల ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సరిపోలేదు.
ప్రభుత్వమే కారణం
పరిస్థితి చేయిదాటి పోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని చెప్పక తప్పదు. ప్రచురణకు నోచుకోని ఆదాయపన్ను శాఖ నివేదిక ప్రకారం పప్పుల ధరలను పెంచేలా వ్యాపారులకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వమే. పైగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికితోడు వ్యవసాయ చట్టాలలో భాగంగా నిత్యావసరాల చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ వ్యవహారంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తనకు తానుగా విచారణ చేపట్టినప్పటికీ ‘తగిన ఆధారాలు లభించలేద’న్న కారణంతో నిలిపివేసింది. ప్రభు త్వానికే చెందిన ఆదాయపన్ను శాఖేమో సర్కారును తప్పు పడితే, మరో సంస్థ సీసీఐ మాత్రం ఆధారాలు దొరకలేదని తప్పించుకుంది. ఒకే సమస్యపై అధ్యయనం చేసిన రెండు ప్రభుత్వ శాఖలు వేర్వేరు అభిప్రాయాలకు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2015లో పప్పుల ధరలను తారుమారు చేసి, అధిక లాభాలు గడించిన నిల్వదారులు, విదేశీ కార్పొరేషన్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ వ్యక్తులే చట్టాలలోని లోపాలను గమనించి, భారతీయుల ఆకలి కేకల నుండి లాభాలు దండుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.
రైతుల మొర వినేదెవరు?
పప్పులపై లాభదాయకమైన కనీస మద్దతు ధరను ప్రకటించాలని దేశంలోని రైతులు పదే పదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వానికి చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా ఉంటోంది. చమురు గింజలు, పప్పులకు సంబంధించి బీజేపీ అనుబంధ భారతీయ కిసాన్ సంఫ్‌ు సైతం పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అమెరికా రైతులకే ప్రాధాన్యత ఇస్తోంది. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ పప్పల దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ దేశంలోని రైతుల గోడు వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. ఊహించిన దాని కంటే ఆహార భద్రత మరింత ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. ఇప్పటికే కూరగాయల ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం పెరగడంతో రైతులు, వినియోగదారులు ఆందోళనలో పడిపోయారు. ఇప్పుడు పప్పుల సరఫరా వ్యవహారాన్ని ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతే, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోతే ప్రజల ఆహారంలో ముఖ్య భాగమైన ‘దాల్…రోటీ’ అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
బైడెన్ మెప్పు కోసం…
జీ-20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని పప్పులపై దిగుమతి సుంకాన్ని 20-30% వరకూ తగ్గించింది. మరే దేశానికీ ఈ వెసులుబాటు ఇవ్వలేదు. భారత్‌కు పప్పులు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న దేశాలలో అమెరికా ఒకటి. కృత్రిమ కొరత కారణంగా నాసిరకం పప్పుల ఎగుమతులకు డిమాండ్ ఏర్పడడానికి ప్రభుత్వ చర్య దోహదపడింది. మరోవైపు బైడెన్‌తో సంబంధాలు బలపడ్డాయి. అమెరికా నుండి పప్పులతో పాటు ద్వితీయ శ్రేణి ఆయుధాలను పొందేందుకు మోడీకి అవకాశం లభించింది. దేశీయ ఉత్పత్తిదారుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి బైడెన్, మోడీ, కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.