‘కారు’ షెడ్డుకేనా?

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల పోటీల్లో ‘కారు’ తుక్కు తుక్కయింది. మార్కెట్లో చాలా వెరైటీ కార్లు ఉన్నా…పాత అంబాసిడర్‌ కారుతో శత్రువును ఢ కొట్టబోయి దెబ్బలు తగిలించుకుంది. హెడ్‌లైట్లు మాత్రం డ్యామేజ్‌ కాలేదు. అన్ని వైపుల నుంచి గుద్దడంతో కారు సొట్టలు పడ్డాయి. వెనుక బ్యాక్‌లైట్లు పగిలిపోయి వైర్లు బయటకు తేలాయి. డోర్లు బిగుసు పోయాయి. టైర్లలో గాలి తగ్గిపోవడంతో ఆ కారు రోడ్ల మీద వంకలు, వంకలు తిరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కారును షెడ్డుకు పంపించారు. దాన్ని పరిశీలించిన కారు మెకానిక్‌ గుండెలు బాదుకున్నాడు. ఇప్పటివరకు నేను ఎన్నో యాక్సిడెంట్లు చూశాను, ఎన్నో కష్టమైన రిపేర్లు చేశాను. కానీ ఇలాంటి ప్రమాదాన్ని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. అంబాసిడర్‌ కారుతో అంత స్పీడ్‌ పోతారా? తాగి ఉన్నారా ఏంది? అంటూ మెకానిక్‌ దెప్పిపొడిచాడు. అయ్యిందేదో అయింది. రిపేర్‌ చేసి కారును రోడ్డెక్కించాలని ‘ఓనర్‌’ ప్రాధేయపడ్డాడు. దీన్ని రిపేర్‌ చేసేందుకు కాస్తా సమయం ఎక్కువగానే పడుతుంది. ఖర్చు కూడా బాగానే అయితది. దీనికి ఒప్పుకుంటే నేను పని మొదలు పెడతానంటూ మెకానిక్‌ నిర్మోహమాటంగా చెప్పిండు.రిపేర్‌ తర్వాత వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కారు హైస్పీడ్‌గా ఉరకాలి అని చెప్పారు. అయితే సపోర్టింగ్‌ డ్రైవర్‌ను నియ మించుకోవాలని మెకానిక్‌ సూచించారు. ఒకరు కాకపోతే మరొకరు డ్రైవర్‌ చేసేలా ఉండాలన్నారు. దీంతో ఆ కారు ఓనర్‌ ఆలోచనలో పడి సపోర్టింగ్‌ డ్రైవర్‌ కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. అనుకున్నట్టే చేదోడు, వాదోడుగా ఉండే డ్రైవర్‌ దొరికాడు. కానీ కారు ఇంకా రిపేర్‌ కాలేదు.ఆలోపు ఇద్దరు డ్రైవర్ల మనసులు కలిశాయి. యమజోరు మీద ఉన్నారు. ఒకరినొకరు సహ కరించుకుంటున్నారు. ఎంపీల సస్పెన్షన్‌లో అది రుజువైంది. గారాల పట్టి మాత్రం రాహుల్‌గాంధీ డీఎన్‌ఏలోనే హిందూత్వ వ్యతిరేకత ఉందంటూ చెప్పుకొచ్చారు.
– గుడిగ రఘు