– మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేదు
– సమస్యలపై పోరాటం కొనసాగుతుంది :-టీడబ్ల్యూజేఎఫ్.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విడుదల చేసిన బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేకపోవడం బాధాకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.అధికార బీఆర్‌ఎస్ పార్టీ జర్నలిస్టులకు పూర్తి వ్యతిరేకం అన్న విషయం ఈ మ్యానిఫెస్టోతో స్పష్టమైందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎలాంటి హామీ ఇవ్వకుండా కేవలం అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తామనడం, ఆరోగ్య రక్ష కింద వైద్య సదుపాయం కల్పిస్తామని చెప్పడం సిగ్గు చేటనీ, ఇది జర్నలిస్టులను మరింత అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం పదేండ్లుగా పోరాటం చేస్తుంటే పట్టించుకోవడం లేదనీ, ఇండ్ల స్థలాలిచ్చే ఉద్దేశం సీఎం కేసీఆర్‌కు లేదన్న విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ జర్నలిస్టులకు చేసిందేమీ లేకపోగా అవమానాలు, ఛీత్కారాలు మిగిలాయని వాపోయారు. తొమ్మిదేండ్లుగా జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ బుట్టదాఖలైందని తెలిపారు. ప్రభుత్వం పట్ల తెలంగాణ జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.