‘ఆత్మనిర్భర్‌’ అంటే ఇదేనా?

గత దశాబ్ద కాలంగా పార్లమెంటు, శాసనసభల ఎన్నికలంటే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కేవలం ఉచితాలు, సంక్షేమ పథకాలు తోనే ఎన్నికల్లో నిలబడటం, అధికారాన్ని కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఉచితాలు జనాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం సహజం. ఎందుకంటే ధరలు పెరిగి నానాయాతన పడుతున్నారు. అయితే ఇది ఎంతకాలం? ఇదేనా స్వాతంత్య్ర సమర యోధులు, రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా, ప్రతీ ఒక్కరూ ఆత్మాభి మానంతో తలెత్తుకుని నిలబడే దేశమని మేధోమథనం చేసే పరిస్థితి నెలకొంది. దేశంలో పేదరికం నిర్మూలనకు, మహిళా అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ కేవలం అధికారం చేపట్టడానికి అపరిమితమైన ఉచితాలు పథకాల పేరుతో కేంద్రం తోపాటు దాదాపు అన్ని రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఒక పార్టీకి మించి మరొకటి ఉబ్బడిదబ్బడిగా ఉచితాలు తమ రాజకీయ మ్యానిఫెస్టోలో పొందు పరుస్తూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ గద్దె నెక్కు తున్నారు…ఈ రకమైన పాలన ఆత్మ నిర్భర్‌ భారత్‌కు ఊతం ఇస్తుందా…. ఆలోచన చేయాలి.
దేశ ప్రజలు తమ కాళ్ళపై తాము స్వతంత్రంగా బతికే పరిస్థితి కల్పించడానికి ముఖ్యంగా విద్యా, వైద్యం అందిం చేందుకు పార్టీలు తమ మ్యానిఫెస్టోను సిద్ధం చేసుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవ కాశాలు కల్పించాలి. కనీస అవసరాలైన కూడు, బట్ట, నివాసం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. అధిక ధరలకు కళ్లెం వేయాలి. పర్యావరణ పరిరక్షణకై పాటుపడాలి. అవినీతి రహిత దేశంగా భారత్‌ ను నిర్మించాలి. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషిచేయాలి. ముఖ్యంగా పారిశ్రామిక రంగాలు అభివద్ధి చెందేలా చర్యలు చేపట్టాలి. ఉత్పత్తి పెంచుట ద్వారానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడుతుందని గ్రహించాలి. ఎగుమతులు పెరగడం ద్వారానే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి అని గ్రహించాలి. రెనె వబుల్‌ ఎనర్జీ వాడకం పెంచాలి. తద్వారా పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణ జరుగుతుందని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా 2024లో, త్వరలో జరిగే వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల సందర్భంగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ నిర్మూలనకు, అధిక ధరలు తగ్గించే మార్గాలు ప్రధాన అజెండాగా వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించుకోవాలి. భవిష్యత్తులో 500 ట్రిలియన్‌ డాలర్లు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలబడాలంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలి. కుల,మత, ప్రాంతీయ, భాషా లింగ ఆధారంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతికి స్వస్తి పలకాలి. దేశ వ్యాప్తంగా ప్రజల వాస్తవ పరిస్థితిని మార్చే విధంగా ప్రణాళికలు ప్రకటించాలి. పేదరికం, అవిద్య, అనారోగ్యం, అవినీతి వంటి రుగ్మతలపై ఎన్నికల సమర శంఖారావం పూరించాలి. చరిత్ర పాఠాలను తొలగించుట ద్వారా, పేర్లు మార్పు చేయడం ద్వారా దేశ భవిష్యత్తు మారదు అని గ్రహించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను కార్పొరేట్లకు ధారాదత్తం చేయుట మానుకోవాలి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం మానుకోవాలి. ఈ 21వ శతాబ్దంలో ఆధునీకరణ సమాజంలో మన దేశ ప్రజలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా అభివద్ధి చెందిన దేశాలతో పోటీపడే వారిగా తీర్చిదిద్దాలి. మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ ఆలోచనల వైపు పయనించేటట్లు చేయరాదు. ముఖ్యంగా యువత, ఓటర్ల విజ్ఞతతో రాబోయే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ కు భరోసా కల్పించే పార్టీలకు అండగా నిలవాలి. తాత్కాలిక ఉపశమనాలు, ఉద్రేకాలకు లోనుకాకుండా, తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దే వారిని అక్కున చేర్చుకోవాలి. దేశ సంపద కొంతమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టే సంస్కతికి స్వస్తి చెప్పే పార్టీల వైపు చూడాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక లోకానికి, యువత, మహిళల అభ్యున్నతికి పాటుపడే రాజకీయ పార్టీల వైపు ఓటర్లు దష్టి సారించాలి.
-రావుశ్రీ