నేటినుంచి ఐసెట్‌ రాతపరీక్షలు

– 75,932 మంది అభ్యర్థుల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌ పి వరలక్ష్మి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 37,112 మంది అబ్బాయిలు, 38,815 మంది అమ్మాయిలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు కలిపి మొత్తం 75,932 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. తెలంగాణలో 16, ఏపీలో నాలుగు కలిపి 20 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఈ పరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.