– భారత ప్రభుత్వం పాలస్తీనాకు అండగా నిలవాలి
– ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ – ముషీరాబాద్
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్దాన్ని ఆపాలని, పాలస్తీనాలో శాంతిని నెలకొల్పాలని, భారత ప్రభుత్వం పాలస్తీనాకు అండగా నిలవాలని సీఐటియూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, టీఎన్‌టీయూసీ, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘాలు తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాలస్తీనాకు మద్దతుగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలస్తీనా భూభాగం మీద, ప్రజల మీద ఇజ్రాయిల్ తీవ్రమైన దాడులు చేస్తున్నదన్నారు.
ఎక్కడ చూసినా శవాల గుట్టలు, పసిపిల్లల ఆర్తనాదాలతో గాజా ప్రాంతమంతా రోదనగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 75 ఏండ్లుగా పాలస్తీనా భూభాగాన్ని అక్రమించుకుంటూ ఈ యుద్దం ద్వారా ప్రపంచ పటం నుంచి పాలస్తీనా ఉనికి లేకుండా చేయాలని, పాలస్తీనా ప్రజలందరిని శరణార్థులుగా మార్చేసి అ భూబాగాన్ని అక్రమించాలని, ఒక సామ్రాజ్యవాద అధిపత్య కుట్రతో యుద్దం కొనసాగుతున్నదన్నారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ.. అమెరికా ఒక్కటే ఇజ్రాయిల్‌కు అండగా నిలబడిందన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం గత సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇది మన దేశానికి ప్రమాదకరమని, ప్రపంచ శాంతికి నష్టం కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా ఇజ్రాయిల్‌లోని గాజా ప్రాంతాన్ని వదిలిపెట్టాలని, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అంగీకరించాలని కోరారు.
కార్యక్రమం లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, టీఎన్‌టీ యూసీ అధ్యక్షులు యంకె బోస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, సీఐటీయూ నాయకులు వంగూరి రాములు, బి మధు, కూరపాటి రమేష్, శ్రీకాంత్, ఈశ్వర్ రావు, వెంకటేష్, కుమార్, మహేందర్, మూడ్ శోభన్ (తెలంగాణ రైతు సంఘం), అరుణజ్యోతి, అశాలత, విమల(ఐద్వా), యం ధర్మానాయక్ (గిరిజన సంఘం) కోట రమేష్, జావెద్ (డివైఎఫ్‌ఐ), టి. నాగరాజు, అశోక్ రెడ్డి, లెనిన్ (ఎస్‌ఎఫ్‌ఐ) తదితరులు పాల్గొన్నారు.