ఇండిగో విమానంలో ఇస్రో చైర్మెన్‌

– ప్రత్యేక అనౌన్స్‌ మెంట్‌
బెంగళూరు: చంద్రయాన్‌-3 విజయంతో ఇస్రో ప్రతిష్ట మరింత వెలుగుతోంది. దేశ ప్రజల దృష్టిలో ఇస్రో శాస్త్రవేత్తలు హీరోలు అయ్యారు. వారు ఎక్కడికి వెళ్లినా విశేష గౌరవాభిమానాలు లభిస్తున్నాయి. తాజాగా ఇస్రో చీఫ్‌ సోమ్‌ నాథ్‌ ఇండిగో విమానంలో ప్రయాణించారు. తమ విమానంలో ఆయన ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఎంతో అపురూపంగా భావించాయి. ఈ నేపథ్యంలో, విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్‌ మెంట్‌ తో గౌరవించాయి. ”ఇవాళ ఈ విమానంలో మనందరితో పాటు ఓ విశిష్ట వ్యక్తి కూడా ఉన్నారు. మీరు (సోమ్‌ నాథ్‌) ఈ విమానంలో ఉన్నందుకు ఇండిగో ఎంతో సంతోషిస్తోంది. మీకు సేవలు అందించే అవకాశం లభించడాన్ని మాకు మహాభాగ్యంగా భావిస్తున్నాం. దేశం గర్వించేలా చేసిన మీకు ధన్యవాదాలు” అంటూ గౌరవ వచనాలు పలికారు. ఈ సందర్భంగా విమానం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. అనంతరం సోమ్‌ నాథ్‌ కు ఎయిర్‌ హౌస్టెస్‌ ఫుడ్‌ ట్రే ఇస్తూ, ఇండిగో తరఫున ఓ గ్రీటింగ్‌ కార్డును కూడా అందించింది.