ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

Issuance of election notification– మరింత కఠినంగా నియమావళి అమలు
– యువ ఓటర్లు 9,10,810 మంది
– 10వ తేదీలోపు తుది ఓటర్ల జాబితా
– ఆ తర్వాతే ఇంటింటికీ పోల్‌ స్లిప్‌ల పంపిణీ
– రైతుబంధుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు : రాష్ట్ర సీఈఓ వికాస్‌రాజ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. శుక్రవారం ఉదయం పది గంటలకు రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడికక్కడ ఈ నోటిఫికేషన్లను జారీ చేశారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేశారు. అనంతరం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఈఓ వికాస్‌రాజ్‌ ఎన్నికల నియమ నిబంధనలు వివరించారు. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛ, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయపార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. రైతుబంధు విడుదలపై తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదనీ, అదే సమయంలో దానిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టంచేశారు. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేయోచ్చని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయోచ్చనీ, డిపాజిట్‌ మాత్రం ఒక్కదానికే చెల్లించాలన్నారు. నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్‌ల దాఖలు విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, ఏ కాలమ్‌ను ఖాళీగా వదలకూడదని వివరించారు. నవంబర్‌ 30న జరిగే పోలింగ్‌ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. అక్టోబరు 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబరు 10వ తేదీ వరకు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాతే ఇంటింటికీ పోల్‌ స్లిప్‌ల పంపిణీ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రెండు వేల పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశామనీ, 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనంగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటున్నదనీ, దాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలనీ, వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉన్నా, నేరుగా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓట్లు వేసేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 18వేల వీల్‌ఛైర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 9 లక్షల 10వేల 810 మంది యువ ఓటర్లు ఉన్నారనీ, వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నవంబర్‌ 2 తేదీ నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 21 లక్షల 88 వేల753గా ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామనీ, 362 కేసులు, 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రగతిభవన్‌కు తామిచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చారనీ, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే వివిధ రకాల అనుమతుల కోసం 9,630 దరఖాస్తులు వచ్చాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 205 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామనీ, స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటివరకు 137 ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయనీ, వాటిలో 13 బీఆర్‌ఎస్‌, 16 కాంగ్రెస్‌, ఐదు బీజేపీ, మూడు బీఎస్పీకి సంబంధించి అనుమానిత కేసులు ఉన్నాయని వివరించారు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఎన్నికల సంఘం లక్ష్యమనీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా ఆయా విభాగాల చర్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు అదనంగా 375 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని తెలిపారు. ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి దురదృష్టకరమనీ, దానిపై తమకు పోలీసుల నివేదిక వచ్చిందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించామని అన్నారు. అనుమానాస్పద ఆన్‌లైన్‌ దావాదేవీలపై నిఘా ఉంచుతామనీ, దానికోసం శుక్రవారం బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమై విధివిధానాలు, నిబంధనలు తెలిపామని చెప్పారు.