మ‌నలోని ఊహాశక్తిని వెలికితీస్తుంది

మ‌నలోని ఊహాశక్తిని వెలికితీస్తుందిప్రతి ఒక్కరూ సొంతింటి కోసం కలలు కంటుంటారు. ఆ కల నెరవేరాక ఇల్లు ఎంతో అందంగా తీర్చిద్దుకోవాలనుకోవడం సహజం. దానికోసం ఇంటీరియర్‌ డిజైనర్స్‌ని సంప్రదిస్తుంటాం. ఈ ప్రొఫెషనల్‌ కోర్స్‌ని నేడు ఎంతో మంది మహిళలు తమ వృత్తిగా స్వీకరిస్తున్నారు. అటువంటి వారిలో నిఖిత పటేల్‌ ఒకరు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన నిఖిత ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో బ్యాచలర్‌ కోర్స్‌ చేశారు. అది పూర్తి చేసిన తర్వాత ‘వైట్‌ రోజ్‌ ఇంటీరియర్స్‌’ అనే సంస్థను స్థాపించారు. గత పదేండ్లుగా ఈ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఈ ఫీల్డ్‌లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా?
సాధారణంగా మాకూ, కష్టమర్స్‌కి ఎక్కువగా మేము చేసిన సర్వీస్‌ ఫీజు విషయంలో తేడా వస్తుంటుంది. ఇంటీరియర్‌ సర్వీస్‌ ఛార్జీలకు సంబంధించి సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మేము అంటే డిజైనర్లు ఉచితంగా సామాజిక సేవ చేయడం లేదని, ఇదీ మాకు జాబ్‌ లాంటిదే అనీ, ఈ రంగంలో మాకు కూడా చాలా పని ఒత్తిడి వుంటుందని చెబుతూనే ఉంటాము. మా ఇంటీరియర్స్‌ అనేది కూడా ఒక ఇండిస్టీ లాంటిదే. వేరే వాటికి వున్నట్లే మేము చేసే పనికి కూడా చార్జెస్‌ వుంటాయని మెల్లగా నచ్చజెప్తాము. అయినా బేరాలు ఆడుతూనే ఉంటారు.
మహిళలకి ఈ రంగంలో నిలదొక్కుకునే అవకాశాలు వున్నాయంటారా?
అసలు ఏ వ్యాపారమైనా నిలబెట్టుకోవడం అనుకున్నత సులభం ఏమీ కాదు. అందునా మహిళలకూ మరీ కష్టం. నిలకడగా వుంటూ స్థిరత్వం సంపాదించాలి అనే దాన్ని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజూ ఏ లక్ష్యంతో వ్యాపారం మొదలు పెట్టారో అదే శక్తితో పోరాడుతూ మన లక్ష్యం చేరుకోవాలి. ప్రతిరోజూ మన ఆలోచనలను ఎంచుకున్న లక్ష్యం వైపే దృష్టి పెడుతూ పని చేస్తూ ఉండాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వుండాలో, ఎలా వుంటే ఇల్లు అందంగా కనబడుతుందో మహిళలకే బాగా తెలుస్తుంది. కాబట్టి పట్టుదల ఉంటే ఈ రంగంలో మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి.
ఇంటీరియర్‌ డిజైనింగ్‌ ఎంచుకునే నేటి మహిళలకు మీరిచ్చే సలహా..?
నా ఉద్దేశంలో నిస్సందేహంగా ఇది మహిళల నేతృత్వంలో నడిచే ఒక ఇండిస్టీ. ఇది పూర్తిగా మహిళల ఆసక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఇంటీరియర్స్‌ డిజైనర్‌ వృత్తిని సరియైన పంధాలో అనుసరిస్తూ, స్పష్టమైన ఉద్దేశాలతో ఈ వృత్తిని ఎంచుకునే మహిళలను నేను కచ్చితంగా ప్రోత్సహిస్తాను. ఎంచుకున్న ఏ రంగమైనా కష్టపడి పని చేస్తేనే మంచి ఫలితాలుంటాయి. అప్పుడు విజయం కచ్చితంగా సాధించవచ్చు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మహిళలోని ఊహా శక్తిని వెలికి తీస్తుంది. ఈ రంగంలో కూడా స్త్రీలకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడూ ‘క్యాట్‌ వాక్‌’ కాదు, చాలా కష్ట పడాలి. ఈ రంగం ఎంచుకునే వారికి మూడువందల అరవై రోజులూ పనే. వారాంతాలు, సెలవులు అంటూ వుండవు. మన ఫోకస్‌ ఎప్పుడూ పని మీదే ఉండాలి. అప్పుడు తప్పక సక్సెస్‌ అవుతారు. ఇది నా అనుభవం నుండి చెబుతున్న మాట.
అంటే 24 గంటలు పని చేయాల్సిందే అంటారు?
అంతే…. ఒక ఇల్లు, ఫ్లాట్‌, ఆఫీస్‌ ఇలా ఏదైనా ఇంటీరియర్‌ వర్క్‌ని ఒప్పుకున్నాము అంటే నా అప్రోచ్‌ ఎల్లప్పుడూ పర్ఫెక్ట్‌గా కష్టమర్స్‌ కోరిన విధంగా ఫైనల్‌ రిజల్ట్‌ వచ్చేలా చూడటంపైనే వుంటుంది. ఫోకస్‌ ఎల్లప్పుడూ నా కష్టమర్స్‌ సంతృప్తి పైనే వుంటుంది. నా పయనం ఎప్పుడూ ఒప్పుకున్న వాటిని సరిగ్గా అమలు చేసి అనుకున్న టాస్క్‌ని పూర్తి చేయటం పైనే వుంటుంది.
ఓ మహిళా వ్యాపారవేత్తగా ఈ రంగంలో మీ అనుభవాలు..?
ఈ రంగంలో అడుగు పెట్టిన తర్వాత సుమారు నూటయాభైకి పైగా ప్రాజెక్ట్‌లు చేశాను. వీటిపై నాకు కొంత అవగాహన ఉంది. ప్రాజెక్ట్‌ పెద్దదా చిన్నదా, సులభమైందా లేదా కష్టమైనదా అని ఆలోచించను. మా డిజైనింగ్‌ పట్ల కష్టమర్‌ హ్యాపీగా ఉండాలి. ఒక ప్రాజెక్ట్‌ మా దగ్గరికి వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన సవాలుతో వస్తుంది. ఒక్కో ప్రాజెక్ట్‌ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మరింత కొత్త డిజైనింగ్స్‌తో ముందుకు వెళ్ళేందుకు మాకు సహాయం చేస్తుంది. ఎన్నో కొత్త అనుభవాలను ఇస్తుంది.
ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో మీ సంస్థ ప్రత్యేకతలు..?
నేను ఇంటీరియర్‌ డిజైన్‌ ఫ్రీలాన్సర్‌ని. మా సంస్థ రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, రిటైల్‌ సెక్టార్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఇంటీరియర్‌ సొల్యూషన్స్‌లో ప్రత్యేక మైంది. భారతదేశంలో అన్నీ చోట్లా సేవలు అందిస్తాం. మా ప్రస్తుత ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, పూణేలో నడుస్తున్నాయి. మేము ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌ అన్నీ పూర్తయి కష్టమర్స్‌కి హాండోవర్‌ చేసే సమయంలో వారు అనుకున్నరీతిలో పూర్తయిందని భావించి తృప్తిగా ఉంటే అవే మాకూ సంతోషకరమైన సంఘటనలు. వారి కండ్లలోని సంతృప్తికరమైన మెరుపులు చూసి నేను విజయం సాధించినట్లుగా ఫీల్‌ అవుతుంటాను.
అయితే అసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ రంగంలో రావొచ్చంటారు..?
కచ్చితంగా రావొచ్చు. అయితే ఈ ఇంటీరియర్‌ రంగాన్ని ఎంచుకునే ముందు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారో ముందే ఓ నిర్ధారణకు రావాలి. అంటే స్టూడియో లేదా కార్పొరేట్‌లో ఉద్యోగమా లేదా సొంత కంపెనీని ప్రారంభించడం ఇలా దేన్ని ఎంచుకోవాలో ముందే ఓ ప్లాన్‌ ఉండాలి. ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం.. అలాగే ఏ రంగంలో స్థిరపడ దలుచుకున్నారు అనేది ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. తాత్సారం చేయకూడదు. కాలం గడిచి పోతూ వుంటుంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు మాత్రం బాగా ఆలోచించాలి.
ఈ రంగంలోనూ కాంపిటీషన్‌ ఉంటుందా?
ఈ రంగంలో ఉన్న ప్రతి డిజైనర్‌ గొప్పవాళ్లే అని నేను నమ్ముతాను. ప్రతి డిజైన్‌ ప్లాన్‌ (దృక్పథం) డిజైనర్‌ నుండి డిజైనర్‌కు, క్లయింట్‌ నుండి క్లయింట్‌కు మారుతూ ఉంటుంది. ఇందులో చేసే పనిలో మీకు మీరే పోటీగా మారాలి. అప్పుడే కొత్తదనం కనిపిస్తుంది. ఈ రంగంలో ఎంత కొత్తదనం చూపిస్తే అంత గొప్పగా ఎదగొచ్చు.
– మణి నాథ్‌ కోపల్లె, 9703044410